సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని తమ పార్టీ తీర్మానించిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ శుక్రవారం చెప్పారు. వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని ఆలపిస్తామని, దీన్ని తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర గీతంగా మారుస్తామని తెలిపారు.
వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో టీఎస్‌ను టీజీగా మారుస్తామన్నారు. సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాల డిజైన్‌ను శనివారం విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో ఎలాంటి వివాదం లేదని ఉద్ఘాటించారు. అన్ని గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ద్వంద్వ నీతిని గమనించాలి: మల్లు రవి
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ద్వంద్వ నీతిని గమనించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి కోరారు. అంబేడ్కర్ పేరును సచివాలయానికి పెట్టినందుకు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ గతంలో చెప్పారని, ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ ఉపసంహరించుకోలే దన్నారు.
కాగా, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రూపొందిన తెలంగాణ తల్లిపై కాంగ్రెస్ లో భిన్నభిప్రాయాలు విన్పిస్తున్నాయి. గురువారం సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నివాసంలో జరిగిన సీనియర్ల భేటీలో ఈ విషయంపై చర్చ జరిగిందని సమా చారం. రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందిస్తామన్న రేవంత్ ప్రకటన గురించి ప్రస్తావన రాగా...ప్రాంతీయ పార్టీల మాదిరిగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కాంగ్రెస్‌కు ఉండదని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment