సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల గరిష్ట వినియోగం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికి తగ్గట్లే నీటి లభ్యత పెంచుకునే చర్యలకు వేగంగా పావులు కదుపుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ శ్రీశైలానికి చేరేముందే వీలైనంతగా వినియోగించుకునే చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద భారీ బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక రచిస్తోంది. ముంపు ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎంత పెద్దదైతే అంత పెద్ద బ్యారేజీ నిర్మాణం చేయాలని, అక్కడి నుంచి ఇతర ప్రాజెక్టుల అవసరాలకు నీటిని మళ్లించుకోవాలని శనివారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయించింది.
గరిష్ట వరద వినియోగమే లక్ష్యంగా..
కృష్ణా నది ఎగువ కర్ణాటక నుంచి జూరాల వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచే జూరాలను దాటుకొని నది శ్రీశైలం, అటు నుంచి నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా సముద్రంలో కలుస్తుంది. జూరాలకు ఏటా ఎగువ నుంచి 300 నుంచి 1,000 టీఎంసీల మేర వరద జలాలు వస్తున్నాయి. అయితే జూరాల సామర్థ్యం కేవలం 9.66 టీఎంసీలే కావడంతో వచ్చిన నీరంతా వచ్చినట్లే దిగువ శ్రీశైలానికి వెళుతోంది. జూరాలతోపాటే దానిపై ఆధారపడి చేపట్టిన నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ఎత్తిపోతల పథకాల ద్వారా 73 టీఎంసీల మేర మాత్రమే నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా పనులు పూర్తికాకపోవడంతో ఇది సాధ్యపడట్లేదు. జూరాల సహా ఈ ఎత్తిపోతల పథకాల కింద 28 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూరాలకు వచ్చే వరద నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు వెల్లటూర్ వద్ద కొత్త బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు.
గరిష్టంగా 55.3 టీఎంసీల వరకు...
జూరాలకు దిగువన చేపట్టే వెల్లటూరు బ్యారేజీ నిర్మాణంపై ఇంజనీర్లు కొంత అధ్యయనం చేసి ప్రాథమికంగా కేబినెట్‌కు నివేదించారు. జూరాల దిగువన కాంటూర్ లెవెల్ 840 అడుగుల నుంచి 899 అడుగుల లెవెల్ కాంటూర్ వరకు వివిధ స్థాయిల్లో బ్యారేజీ నిర్మాణం చేస్తే లభించే నీటి నిల్వల సామర్థ్యంపై లెక్కలు వేశారు. కాంటూర్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ నీరు విస్తరించే ప్రాంతం (వాటర్ స్ప్రెడ్ ఏరియా) పెరుగుతుంది. 840 అడుగుల వద్ద వాటర్ స్ప్రెడ్ ఏరియా కేవలం 28.64 చదరపు కిలోమీటర్లు ఉండగా, 899 అడుగుల వద్ద 161.76 చ.కి.మీ. విస్తీర్ణం ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని 846 అడుగుల వద్ద 2.02 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీ సాధ్యం అవుతుండగా, 899 అడుగుల వద్ద 55.3 టీఎంసీల సామర్థ్యం గల బ్యారేజీ నిర్మించవచ్చని లెక్కగట్టారు. అయితే ఇందులో ఏ లెవెల్‌లో బ్యారేజీని నిర్మించాలి, ఎంత సామర్థ్యంతో నిర్మించాలన్న దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ముంపును సైతం పరిగణనలోకి తీసుకుంటే కనిష్టంగా 21.15 టీఎంసీల నుంచి గరిష్టంగా 35 టీఎంసీల సామర్థ్యం గల బ్యారేజీ సాధ్యమవుతుందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. 3.82 కి.మీ. పొడవుతో దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి. ఇక్కడ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే అటు నుంచి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా తక్కువ భూసేకరణతో నీటిని పాలమూరు–రంగారెడ్డిలోని ఏదుల రిజర్వాయర్‌కు తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిద్వారా పాలమూరు ఆయకట్టుతోపాటు కల్వకుర్తి ఆయకట్టుకు నీటి లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
వివిధ కాంటూర్ లెవెల్‌లో బ్యారేజీలో సాధ్యమయ్యే నిల్వలు ఇలా (టీఎంసీల్లో)
కాంటూర్ లెవెల్ బ్యారేజీ సామర్ధ్యం
(అడుగుల్లో)
846 2.02
850 3.16
853 4.57
856 6.39
859 8.66
863 11.29
866 14.25
869 17.6
872 21.15
876 24.9
879 28.85
882 32.81
885 35.78
886 36.77
889 40.75
892 44.51
893 45.02
895 49.87
899 55.3
Comments
Please login to add a commentAdd a comment