
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధిపై సెప్టెంబర్ 12లో నివేదిక ఇవ్వాలంటూ గత నెల 26న తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నివేదించారు. గతంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన మేరకు శనివారం సోమేశ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరీవాహక ప్రాంతాలైన 84 గ్రామాల్లో భారీ నిర్మాణాలు చేపట్టకుండా 1996లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 జారీచేసింది.
అయితే 84 గ్రామాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు...జీవో 111 పరిధిపై విచారణ జరిపి 45 రోజుల్లో నివేదిక సమర్పించేందుకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఐదేళ్లు గడిచినా నివేదిక సమర్పించకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 111 పరిధిపై హైపవర్ కమిటీ వెంటనే నివేదిక ఇవ్వకపోతే...కోకాపేట్‌లో ఇటీవల ప్రభుత్వం భూములను వేలం వేయడం ద్వారా వచ్చిన రూ.2 వేల కోట్లను ఖర్చు చేయకుండా ఎస్క్రో (మూడో వ్యక్తి ఖాతా) ఖాతాలో ఉంచేలా ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలు ఏంటంటే
‘జీవో 111 పరిధిపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సెపె్టంబర్ 12లోగా నివేదిక సమర్పించాలి. ముఖ్యంగా వట్టినాగులపల్లిలోని నాన్ క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉన్న సర్వే నెంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) నివేదికను ప్రత్యేకంగా పరిశీలించి దీనిపై ఈ నెలాఖరులోగా తగిన నిర్ణయం తీసుకోవాలి. సెప్టెంబర్ 12లోగా నివేదిక సమర్పించకపోతే ఉన్నతస్థాయి కమిటీ రద్దవుతుంది. ఈపీటీఆర్‌ఐ నివేదికపై ఉన్నతస్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను అక్టోబరు రెండో వారంలోగా మున్సిపల్, నగర అభివృద్ధి విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment