సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీకా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కాలనీల్లోని కమ్యూనిటీ హాళ్లు, అపార్ట్‌మెంట్లు, గ్రామాల్లో ప్రస్తుతం మూసి ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రజల ముంగిటికే కరోనా వ్యాక్సిన్లను అందించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రోజుకు ఐదు లక్షల మందికి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటివరకు 38 లక్షల మందికి..
జనవరి మూడో వారంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 38.05 లక్షల మందికి టీకాలు వేశారు. వాస్తవానికి వ్యాక్సినేషన్ మొదలైన తొలిరోజుల్లో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు నిండినవారికి, తర్వాత 45 ఏళ్లు నిండినవారికి మాత్రమే టీకా ఇవ్వడంతో స్పందన పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌తో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సినేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా కేంద్రాల్లో రద్దీ పెరుగుతోంది. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. టీకా కేంద్రాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కేసీఆర్ ఆదేశాలతో
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచి వీలైనంత త్వరగా, వీలైనంత ఎక్కువ మందికి టీకా వేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది. మరో ఐదారు రోజుల్లో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ కేంద్రాలను పెంచి, రోజుకు ఐదు లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేసేలా రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,473 టీకా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వంలో 1,219, ప్రైవేటులో 254 కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా రోజుకు సగటున 2 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు.
అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసి..
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను కీలకం చేసింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలిరోజుల్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకా వేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, లబ్ధిదారుల స్థితిని పరిశీలిస్తే.. ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ కేంద్రాలకు నేరుగా వచ్చినవారి వివరాలను అప్పటికప్పుడు నమోదు చేసి వ్యాక్సిన్ వేస్తున్నారు. మే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో విడత వ్యాక్సినేషన్‌లో కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు.
విస్తృతంగా టీకా సెంటర్లు
18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయనున్న నేపథ్యంలో టీకా కేంద్రాల సంఖ్యను 4వేల వరకు పెంచాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు నిండిన వారు 70 శాతం వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పుడున్న 1,473 కేంద్రాల ద్వారానే పంపిణీ చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. అందువల్ల భారీగా సెంటర్లు పెంచాలని నిర్ణయించారు. కమ్యూనిటీ హాళ్లు, పెద్ద అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో.. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను కూడా వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రణాళికకు తుది రూపు వస్తే వ్యాక్సినేషన్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే వీలుంటుందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment