సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తండాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ యాత్రలో తనకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున వారి సమస్యలను విన్నవిస్తురన్నారని అన్నారు. కాగా, రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్నిటీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు, ప్రభుత్వానికి భయపడేది లేదని అన్నారు. రేపు నిర్మల్‌లో నిర్వహించనున్నభారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్‌షా హజరవుతారని తెలిపారు. ఆయన నాందేడ్ నుంచి నిర్మల్‌కు చేరుకుంటారని అన్నారు. ఈ సమావేశానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దరిద్ర స్థితిలో ఉందని విమర్షించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారని అన్నారు.
కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రం కట్టే నిధుల కన్నా.. కేంద్రం అధిక నిధులను రాష్ట్రానికి ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ద్రోహి కేసీఆర్.. ఆయన ఒక నయా నిజం అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలకు కేంద్రం ఒక వెయ్యి నాలుగు లక్షల కోట్ల రూపాయలు, జాతీయ రహదారుల కోసం 40 వేల కోట్లను కేంద్రం మంజురు చేసిందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న ఘనత మోదీది అని అన్నారు. దీనికోసం 2700 కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వాలకు మంజురు చేశామని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే పార్లమెంట్‌లో ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. కేసీఆర్ చర్యల వలన రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని తెలిపారు. కేసీఆర్ పాలనమీద దృష్టిపెట్టకుండా.. బై ఎలక్షన్‌లు కోరుకునే వ్యక్తి అని అన్నారు.
పాతబస్తీలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్‌కు,టీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. ఢిల్లీలో వంగి వంగి మొక్కిన పిరికోడు కేసీఆర్.. అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తన యాత్రలో ప్రజలకు నిజాలు వివరిస్తున్నామని అన్నారు. ఇకపై టీఆర్‌ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని విమర్షించారు. కేంద్రం నిధులపై కేసీఆర్ చర్చకు సిద్ధమా.. పోడు భూముల సమస్యలపై కేసీఆర్ సర్కార్ తీరు సరిగ్గాలేదని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment