నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని వచ్చే ఏప్రిల్‌లో ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నాటికి విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అవుతున్నందున, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున పర్యాటకుల వీక్షణకు వీలుగా విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
సోమవారం విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భారీ విగ్రహాన్ని ఢిల్లీలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శిల్పి రాంసుతార ఆధ్వర్యంలో తయారు చేసినట్లు చెప్పారు. తరలింపునకు వీలుగా ముక్కలుగా రూపొందించిన విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడి వేదికపై పేర్చి అతికిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం పదకొండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని మంత్రులు వెల్లడించారు. దిగువ పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇంకా అంబేడ్కర్‌కు సంబంధించిన చిత్రాలు, పార్లమెంటులో ఆయన ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించేందుకు మినీ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ భవనం మీద అంబేడ్కర్ విగ్రహం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment