సాక్షి, సిటీబ్యూరో: పాత నగరానికి మెట్రో జర్నీ కలగా మారనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో పనులు చేపట్టేందుకు గతంలో పలు మార్లు హడావుడి మొదలైనప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మెట్రో నిర్మాణ సంస్థ వర్గాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నష్టాల మెట్రో గాడిన పడేందుకు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. దీంతో పాతనగరంతోపాటు రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలోనూ మెట్రో ఎప్పటికి పూర్తవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారడం గమనార్హం.
సమస్యలు ఎన్నో..
► ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీద సాములా మారాయి.
► పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
► సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
► ఇక పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు నిర్మాణ గడువు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
► ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి.
► ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం.
► గతంలో మెట్రో అధికారులు, నిర్మాణ సంస్థ వర్గాలు ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీఛబుత్రా, అలియాబాద్, షంషీర్‌గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా..అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం.
► మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఇటీవల ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం.
మెట్రో కోసం మహా పోరాటం..
పాతబస్తీ మెట్రో కోసం పలు రాజకీయ పార్టీలు మహా పోరాటమే చేశాయి. పలు రాజకీయ పారీ్టలతోపాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల పాదయాత్రలతో మెట్రో ప్రాజెక్టు కోసం మహా ఉద్యమమే సాగింది. 2017 నుంచి 2021 వరకు పలు రాజకీయ పార్టీలు మెట్రో కావాలని నినదిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment