దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకంటే తెలంగాణలోనే మద్యం కోసం ఎక్కువ ఖర్చు
వార్షిక తలసరి ఖర్చు రూ. 1,623... బెంగాల్‌లో కేవలం రూ.4 మాత్రమే
2016–17తో పోలిస్తే 2022–23లో ఏపీలో తగ్గిన ఖర్చు
కరోనా సమయంలో తెలంగాణలో మరింత ఎక్కువ ఖర్చయిందని వెల్లడిస్తున్న సర్వే గణాంకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెళ్లి అయినా, చావు అయినా... సందర్భమేదైనా... పది మంది కూడారంటే ఒకటి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీకు అర్థమయినా కాకపోయినా, మీరు ఊహించినా లేకున్నా దానిపేరు మద్యం. ఈ మద్యం కిక్కు లేకుండా మన దగ్గర ఏ సంబురం నడవదంటే అతిశయోక్తి కాదు.
అందుకేనేమో దేశంలోకెల్లా అత్యంత ఎక్కువ తలసరి మద్యం ఖర్చు మన రాష్ట్రంలోనే నమోదయింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం మీద తలసరి ఖర్చు బాగానే నమోదైంది. తెలంగాణ తలసరి ఖర్చు రూ. 1,623 కాగా, ఏపీలో అది రూ.1,306గా నమోదైంది.
అయితే, 2016–17తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఖర్చు తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లో ఏపీలో సగటు మనిషి ఏడాదికి రూ. 1,324 మద్యం మీద వెచ్చిస్తే, 2022–23 వచ్చేసరి కి అది రూ.1,306కి తగ్గడం గమనార్హం. ఇక, కరోనా సమయంలో అయితే తెలంగాణలో అత్యధి క సగటు ఖర్చు నమోదైంది. 2020–21లో ఏకంగా రూ.1,719 తలసరి ఖర్చు వచ్చిందని అధ్యయన గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు తోడుగా రూ. 1,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment