సాక్షి, ఖమ్మం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు. మంటల్లో నిమ్మకాయలు వేస్తూ పూజలు చేశారు. తనను తాను దేవతగా ప్రకటించుకున్న మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే సైన్స్ బోధించాల్సిన డీహెచ్ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్ క్షుద్రపూజల తరహాలో చేశారని రాజకీయ ఎంట్రీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
కాగా కొంతకాలంగా డీహెచ్ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎంపీపీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తనపై దేవతలు పూనుతారంటూ చెప్పుకుంటున్న పూనకం వచ్చిన మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇక తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్ స్పందించారు. తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపారు.
అయితే అనేక విషయాల్లో వివాదంలో ఉన్న ఎంపీపీ.. దేవత అవతారం ఎత్తి భక్తులకు దీవెనలు ఇస్తున్న మహిళ వద్దకు డీహెచ్ వెళ్లారని ఆరోపణలు వస్తుండగా.. ఆ మహిళ ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలీదన్నారు. అంతేగాక తాను చేస్తున్న సేవా కార్యాక్రమాలు గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment