సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రశాసన్‌నగర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీతోపాటు వీఐపీలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ అన్నీ బాగున్నాయి. జీహెచ్‌ఎంసీకి వీఐపీలే ముఖ్యమా? సామాన్య ప్రజలు తిరిగే రోడ్లను మాత్రం మరమ్మతులు చేయకుండా గాలికొదిలేశారు. అంటే సామాన్యుల ప్రాణాలు పోతున్నా పట్టదా? ఆస్తి పన్ను చెల్లించే వారంటే లెక్కలేదా? మేమూ హైదరాబాద్ పౌరులమే. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గుంతలతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం’’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం జీహెచ్‌ఎంసీ యంత్రాంగంపై మండిపడింది. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని, రోడ్లకు మరమ్మతులు చేయడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలని ప్రశ్నించింది.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఇక్కడ వసతులు బాగుంటేనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి గంగాధర్ తిలక్ (73) తన కొచ్చే పెన్షన్ డబ్బులతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లపై గుంతలను పూడ్చుతున్నాడంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించిన జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరో సారి విచారించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని, ఇందులో 6,176 కి.మీ. రోడ్లను కాంక్రీట్ రోడ్లుగా మార్చామని, మిగిలిన రోడ్లను త్వరలోనే కాంక్రీట్ రోడ్లుగా మారుస్తామని జీహెచ్‌ఎంసీ తరఫున సీనియర్ న్యాయ వాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలబారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వీటికి సంబంధించి గత సంవత్సరం తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఏం చేశారో చెప్పమంటే గత ఏడాది చేసింది చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఫిర్యాదుల కోసం యాప్
జీహెచ్‌ఎంసీ పరిధిలోని సమస్యల ఫిర్యాదుకు ‘మై జీహెచ్‌ఎంసీ యాప్’ను ఐదేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చామని నిరంజన్‌రెడ్డి వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యను ఫొటోతీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో 28 వేల ఫిర్యాదులు రాగా, మెజారిటీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. అనం తరం రోడ్ల మరమ్మతులకు తీసుకున్న చర్యలపై తాజాగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
వీఐపీలే ముఖ్యమా? సామాన్యులంటే లెక్కలేదా..?
Published Wed, Jul 21 2021 12:36 AM | Last Updated on Wed, Jul 21 2021 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment