సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని గతంలో తాము స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. యాంటీజెన్ పరీక్షలతో కరోనా నిర్ధారణ సరిగ్గా జరగడం లేదని నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలని స్పష్టంచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా నియంత్రణలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఇతర మెడికల్ సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లు ఇచ్చేలా ఆదేశించాలంటూ న్యాయవాది సమీర్ అహ్మద్‌తోపాటు మరొకరు దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. కరోనా రెండో దశ పొంచివున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి బస్సులు, రైళ్లలో వచ్చే వారికి, విమానాశ్రయాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలునిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది.
300 మొబైల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం
కరోనా నియంత్రణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సీరో సర్వైలెన్స్ చేసేందుకు మరికొంత గడువుకావాలని అభ్యర్థించారు. కాగా, ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని గతంలో ధర్మాసనం ఆదేశించినా.. రాష్ట్రప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
కరోనా మీద పరిశోధన చేస్తున్న అనేక సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు జంట నగరాల్లోని 54 శాతం మంది ప్రజల్లో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో కరోనా లక్షణాల్లేకుండా అనేక మంది ఉన్నారని తెలిపారు. పర్వదినాలు రానున్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. ‘ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను గణనీయంగా పెంచే దిశగా చర్యలు చేపట్టండి. రోజూ ఎన్ని ఆర్‌టీపీసీఆర్, యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 మధ్య చేసిన పరీక్షల వివరాలను జిల్లాల వారీగా వేర్వేరుగా సమర్పించండి’ అని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదావేసింది.
కరోనా కలకలం: 22 మంది విద్యార్థులకు పాజిటివ్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహంలో కరోనా కలకలం సృష్టించింది. వార్డెన్ మురళీమోహన్‌తోపాటు వాచ్‌మన్ బాలచంద్రయ్యకు, 22 మంది విద్యార్థులకు కరోనా సోకిం ది. హాస్టల్‌లో మొత్తం 105 మంది విద్యార్థులకు వైద్యాధికారులు డాక్ట ర్ జయంత్, డాక్టర్ వామన్‌రావు ఆధ్వర్యంలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 22 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. కాగా, రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురు వారం ఉదయం ఉపాధ్యాయులతోపాటు 75మంది విద్యార్థులకు పరీ క్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని హోం క్వారంటైన్ లో ఉంచాలని మండల వైద్య, ఆరో గ్య శాఖ అధికారి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment