
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
కుత్బుల్లాపూర్: రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. సాయం విషయంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు మొండిచెయ్యి చూపుతోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారం కోసం పలు కీలక ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు.
స్కైవేలు, రోడ్ల కోసం కంటోన్మెంట్ పరిధిలో కొంత భూమి అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. వరదల సమయంలో కేంద్రం గుజరాత్‌కు వెయ్యికోట్ల సాయం ప్రకటించిందని, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. త్వరలో మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఈ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తారని తెలిపారు. చెరువులు, కుంటలు, రోడ్లు, స్కైవేల అభివృద్ధి కోసం 7,800 కోట్లు అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశామని, సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.