రాంగోపాల్‌పేట్: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామన్నారని, విదేశాల్లో ఉన్న దాన్ని కూడా దేశంలోకి తెప్పిస్తామని చెప్పారని.. కానీ, అది రాకపోగా నల్లకుబేరులు దేశం వదలి పారిపోయేలా చేశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదలి పారిపోతే బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారం చేపట్టిన మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతూపోయారని ఎద్దేవా చేశారు. మోదీ పాలన కంటే ముందు.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టుకుని వెళ్లాలని నాడు మోదీ అన్నారని చెప్పారు. నేడు అదే సిలిండర్ ధర రూ.870 అయిందని విమర్శించారు. ఇప్పుడు సెంచరీకి చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర చూసి ప్రజలు బంకులోకి వెళ్లి మోదీ ఫొటోకు దండం పెట్టుకుంటున్నారని ఎగతాళి చేశారు. వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దేశం కోసం, ధర్మం కోసం అంటూ విరుచుకుపడుతున్నారని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది దేశం కోసం.. ధర్మం కోసమా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ..?
జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని.. కానీ, దీనిపై తాను ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా తన ఖాతాలో 15 లక్షల తిట్లు బీజేపీ నేతల నుంచి పడ్డాయని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరున్నర సంవత్సరాల కాలంలో తాము 1,32,799 ఉద్యోగాలు కల్పించామని.. మరి మోదీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై మోదీని ప్రశ్నిస్తే.. రోడ్ల పక్కన పకోడీ, ఇడ్లీ బండి పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతున్న వారిని కూడా తాను కల్పించిన ఉద్యోగుల జాబితాలో చూపిస్తున్నారని విమర్శించారు. అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారని.. ఆరున్నరేళ్లలో తామే కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో అందించామని గుర్తు చేశారు. ఇవన్నీ అడిగితే.. బీజేపీ నాయకులు హిందూ, ముస్లిం, పాకిస్తాన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నించే గొంతుక అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు అంటున్నారని.. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా.. అని అన్నారు. న్యాయవాదుల సంక్షే మ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే.. తానే చేయించానని ఆ పెద్ద మనిషి చెబుతున్నారని అంత అభిమానం ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధి ఎందుకు తీసుకుని రాలేకపోయారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు సాయం చేయాలని ఆలోచించినా సుమా రు 10–12 లక్షల మంది ఉండటంతో అది సాధ్యం కాక ఏమి చేయలేకపోయామన్నారు. విద్యావంతులంతా ఈ నెల 14న ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు కోరారు.
నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు
Published Wed, Mar 10 2021 3:24 AM | Last Updated on Wed, Mar 10 2021 3:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment