రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా..
5 steps
►ప్రత్యేక ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో టీకాలు ముందుగా కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు చేరిక
►స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌లో కోటిన్నర వ్యాక్సిన్ల నిల్వకు నాలుగు వాక్ ఇన్ కూలర్లు
►స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి 10 రీజినల్ వ్యాక్సిన్ సెంటర్లకు తరలింపు
►రీజినల్ వ్యాక్సిన్ సెంటర్ల నుంచి జిల్లాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు చేరవేత
►అక్కడి నుంచి 10 వేల వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ సిద్ధమైంది. టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా వచ్చేశాయి. వీలైనంత త్వరలో టీకా పంపిణీ కూడా మొదలు కానుంది. పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో తయారయ్యే కోవిషీల్డ్ టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనితో పాటు మరేదైనా టీకా అందుబాటులోకి వస్తే ఈ రెండింటినీ కూడా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తారని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య, లాజిస్టిక్స్... చూసుకొని రాష్ట్రాలకు పంపిణీని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అయితే టీకాలను ఎక్కడ నిల్వ చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కోవిడ్ టీకాలు ప్రస్తుతం అందరికీ కొత్తగా కనిపించినా, ఇతరత్రా టీకాల నిర్వహణ మనకు అనుభవమే.
వేర్వేరు వ్యాధుల కోసం టీకాలను నిత్యం వేస్తూనే ఉన్నారు. మన దేశంలో ఏటా దాదాపు 2.5 కోట్ల మంది నవజాత శిశువులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందిస్తున్నారు. వీటన్నింటి ఉత్పత్తి, పంపిణీలకు సంబంధించి పక్కా ప్రణాళిక, వ్యవస్థలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సిద్ధం చేసి... పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకాకు కూడా ఇదే వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే కోవిషీల్డ్ నిల్వ, రవాణాకు అతిశీతల పరిస్థితుల అవసరం లేదు. రెండు నుంచి ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనే చాలాకాలం నిల్వ ఉంచవచ్చు.
►మొదటగా పుణే నుంచి కోవిషీల్డ్ టీకాలు ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో రాష్ట్రానికి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాక అక్కడి నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్ కంటెయినర్లలో స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు ప్రత్యేకంగా చేరతాయి. ఒకవేళ స్థానిక టీకా వాడకానికి అనుమతిస్తే... తయారీ కేంద్రం నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్ వాహనాల్లో తరలిస్తారు.
► కోఠిలోని స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి రీజినల్ వ్యాక్సినేషన్ సెంటర్లకు టీకాలు వెళతాయి. 10 పూర్వ జిల్లా కేంద్రాల్లో ఈ రీజినల్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ 40 క్యూబిక్ మీటర్లు కలిగిన వాక్ ఇన్ కూలర్లు ఉన్నాయి. ఒక్కో రీజినల్ సెంటర్‌లో ఒక్కో వాక్ ఇన్ కూలర్ చొప్పున సిద్ధం చేశారు.
► రీజినల్ కేంద్రాల నుంచి జిల్లాల్లోని 950 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు, 55 సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లకు టీకాలను సరఫరా చేస్తారు. అందుకోసం ప్రతీ కొత్త జిల్లాకు ఒకటి చొప్పన ఇన్సులేటెడ్ వ్యాన్లను అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం 16 జిల్లాల్లో ఇన్సులేటెడ్ వాహనాలు సిద్దంగా ఉండగా, మరో 17 వాహనాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వాహనాల్లోనే టీకాలను పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు సరఫరా చేస్తారు.
►రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు పెట్టాలన్నది లక్ష్యం. అయితే ముందుగా వ్యాక్సిన్లు తక్కువగానే వస్తాయి కాబట్టి ప్రస్తుతం వెయ్యి సెంటర్లను సిద్దం చేశారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి ఈ సెంటర్లకు టీకాలను వ్యాక్సినేషన్ ఐస్‌బాక్సుల్లో తరలిస్తారు. అందుకోసం స్థానికంగా ఉండే ప్రస్తుత వ్యాక్సిన్ సరఫరా వాహనాలను ఉపయోగిస్తారు. మున్ముందు వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాల భవనాలను కూడా ఉపయోగించుకుంటారు.
►వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా మూడు గదులు ఉండేలా చూస్తారు. ఒక గదిలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారు వేచి ఉండేందుకు సిద్ధం చేస్తారు. రెండో గదిలో వ్యాక్సిన్ వేస్తారు. మూడో గదిలో వాక్సిన్ తీసుకున్నవారు అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ సైడ్ ఎఫెక్టŠస్ వస్తే వారికి అవసరమైన చికిత్స చేస్తారు. సైడ్ ఎఫెక్టŠస్ వస్తే వారికి చికిత్స చేసేలా 14 రకాల వైద్య సంబంధిత వస్తువులతో మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచుతారు. గుండె కొట్టుకునే వేగం తగ్గినా, బీపీ హెచ్చుతగ్గులు ఉన్నా, కళ్లు తిరిగి పడిపోయినా... ఇలా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా చికిత్స చేసేలా మెడికల్ కిట్‌లో మందులు ఉంటాయి.
►హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలో స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ కోటిన్నర వ్యాక్సిన్లను భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు.
అందుకోసం నాలుగు వాకిన్ కూలర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 40 క్యూబిక్ మీటర్లతో ఈ వాక్ ఇన్ కూలర్లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment