2,216 కాదు.. 2,620 | Telangana Reserves 30 percent Of New Liquor Shops To Gouds SC And ST | Sakshi
Sakshi News home page

2,216 కాదు.. 2,620

Published Tue, Nov 9 2021 3:18 AM | Last Updated on Tue, Nov 9 2021 3:18 AM

Telangana Reserves 30 percent Of New Liquor Shops To Gouds SC And ST - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌ (ఏ4) షాపుల పరిధిని నిర్ధారిస్తూ జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న వైన్‌షాపుల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరగనుంది. కాగా, ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు ఇచ్చిన 30 శాతం రిజర్వేషన్‌ మేరకు ఆయా వర్గాలకు జిల్లాల వారీగా కేటాయించాల్సిన షాపులను ఎంపిక చేశారు.

సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డ్రాలను పూర్తి చేసి రిజర్వ్‌డ్‌ దుకాణాలను నోటిఫై చేశారు. మొత్తం 2,620 షాపులకుగాను గౌడవర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల ను కేటాయించారు. మిగి లిన 1,834 షాపులకు ఓపెన్‌ కేటగిరీలో దరఖా స్తులు స్వీకరించనున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు బుధవారం నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

20న డ్రా పద్ధతిలో విజేతలను ఎంపిక చేసి ప్రొవిజనల్‌ లైసెన్సులు ఇవ్వనున్నారు. అయితే, మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలయిన కేసు తీర్పు మంగళవారం వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలి..
జడ్పీ సెంటర్, మహబూబ్‌నగర్‌: ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే తమ లక్ష్య మని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల గౌడ, ఎస్సీ, ఎస్టీల మద్యం దుకాణాలను మంత్రి లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేశారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement