సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకు నుంచి తెచ్చిన రూ.600 కోట్ల అప్పు నుంచి ఇంతకాలం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ వచ్చారు. గత నెలతో ఆ డబ్బులు పూర్తిగా ఖర్చయ్యాయి. వచ్చే నెల జీతాలకు డబ్బుల్లేవు. మూడు రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీతాలకు డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆర్థిక శాఖ అధికారులను కోరారు. ఇందుకు వారు నిరాకరించారు. తమ వద్ద ప్రస్తుతానికి అంత వెసులుబాటు లేదని, డబ్బు కావాలంటే సీఎంతోనే మాట్లాడుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించాలని, ఇలా ప్రతినెలా ఆర్థిక శాఖను డబ్బు అడగటం సరికాదని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఎండీ సునీల్‌శర్మ అధికారులతో సమావేశమై ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. మరోవైపు కేంద్రం బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం గడువు పూర్తి కావటంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆర్టీసీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించని పక్షంలో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ (ఎన్‌పీఏ)గా ఆర్టీసీకి రిమార్క్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మూడు నెలలుగా బిల్లుల కోసం తిరుగుతున్న అద్దె బస్సు యజమానులు మూడు రోజుల క్రితం బస్‌భవన్‌ను ముట్టడించారు. డబ్బులు చెల్లిం చని పక్షంలో వారు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ సహకార పొదుపు సంఘం (సీసీఎస్) సంస్థ వాడుకున్న తమ డబ్బు కోసం హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. వచ్చేనెల 5న కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆర్టీసీకి దిక్కుతోచడం లేదు.
శివారు గ్రామాలకు బస్సులు
చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment