సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సమయంలో జర్నీ బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్‌వ్యాప్తిని అడ్డుకొనేందుకు మాస్కు ఒక్కటే రక్షణ కవచం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రయాణీకులు బేఖాతరు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ఉన్నప్పటికీ వాటిని కేవలం అలంకారప్రాయంగా ధరిస్తున్నారు.లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో గత 3 నెలలుగా దూరప్రాంతాలు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిమితంగానైనా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. మొదట్లో ఈ బస్సులను ఉప్పల్, ఎల్‌బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, తదితర శివార్లకే పరిమితం చేశారు. ఆ తరవాత మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్‌లకు కూడా బస్సులను అనుమతించారు. బస్సులు రోడ్డెక్కిన తొలి రోజుల్లో కోవిడ్ నిబంధనలు పటిష్టంగానే అమలు జరిగాయి. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు చేతులు శుభ్రం చేసుకొనేవిధంగా శానిటైజర్‌లు అందుబాటులో ఉంచారు.
మాస్కులేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మైకుల ద్వారా ప్రచారం కూడా చేపట్టారు.కానీ క్రమంగా ఈ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు కరోనా బాధితులు ప్రయాణం చేసినా పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కరోనా బారిన పడకుండా కాపాడుకొనేందుకు ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ ‘తమకేం కాదులే’ అని నిర్లక్ష్య ధోరణి అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఏ మాత్రం మినహాయంపు కాదు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న బస్సులను పరిశీలించినప్పుడు ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.
నిబంధనలు నీరుగార్చారు....
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 3500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.25 లక్షల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.కానీ కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా అన్ని సర్వీసులను నిలిపివేశారు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణ జిల్లాలకు మాత్రమే బస్సులను పరిమితం చేశారు. దీంతో రోజుకు 800 నుంచి 1000 బస్సుల వరకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడుస్తున్నాయి. మొదట్లో ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేకపోయినప్పటికీ జూలై నుంచి క్రమంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక బస్సులో సగటున 50 మంది చొప్పున ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు తెలంగాణలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులకే డిమాండ్ బాగా ఉంది. కానీ ఇదే సమయంలో గత రెండు నెలలుగా కోవిడ్ ఉధృతి కూడా పెరిగింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్ జిల్లాలను, గ్రామీణ ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది పల్లెల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల్లో వందల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రయాణికుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రాకపోకలు సాగించే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 8 చోట్ల కాలితో తాకి వినియోగించుకొనే శానిటైజర్‌లను ఏర్పాటు చేస్తే వాటిని గుర్తు తెలియని వాళ్లు తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం మేనేజర్ కార్యాలయం వద్ద మాత్రం రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ‘ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్‌లను వినియోగించాలని’ చెబుతున్నప్పటికీ కొంతమంది పట్టించుకోవడం లేదని ఎంజీబీఎస్ అధికారి ఒకరు చెప్పారు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక ఎల్‌బీనగర్, ఉప్పల్, తదితర కూడళ్ల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఆర్టీసీ సిబ్బందే ప్రయాణికులకు శానిటైజర్ ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి సదుపాయం కనిపించడం లేదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే ఒత్తిడి కూడా లేకుండా పోయింది.
అన్‌లాక్‌లో పెరగనున్న రాకపోకలు...
సెప్టెంబర్ నుంచి నిబంధనలు మరింత సడలనున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమవుతాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మిగతా రాష్ట్రాలతో కూడా రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మెట్రో సర్వీసులతో పాటు, ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీ బస్సులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.‘‘ జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడం వల్ల కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కొద్దిగా తగ్గుముఖం పడుతున్న వైరస్ ఉధృతి తిరిగి పుంజుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు’’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ హర్ష చెప్పారు.
జాగ్రత్తలు తప్పనిసరి....
⇔ మాస్కులు ధరించడంతో పాటు, ప్రతి ప్రయాణికుడు శానిటైజర్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.
⇔ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు హ్యాండిల్ రాడ్ పట్టుకోక తప్పదు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవలసిందే.
⇔ సీట్లో కూర్చున్న తరువాత కూడా చాలా మంది తరచుగా తమ ముందు ఉన్న సీట్ ఫ్రేమ్‌ను పట్టుకుంటారు.అలా పట్టుకోవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది.
⇔ సీట్లో ఇద్దరు, ముగ్గురు అపరిచితులు కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్యలో మాస్కు తీయకుండా ప్రయాణం పూర్తయ్యే వరకు పూర్తిగా ధరించి ఉండాల్సిందే.
⇔ డ్రైవర్లు, కండక్టర్‌లు మాస్కులు లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రయాణికులే వారిని అప్రమత్తం చేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment