ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు, దసరా వేడుకలు జరుగుతున్నాయి. మాకు మాత్రం కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. కష్టపడి చదువుకున్నాం. పోటీపరీక్షల్లో గెలిచాం. ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికయ్యాం. కానీ ఇప్పటి వరకు పోస్టింగులు ఇవ్వలేదు. 10 నెలలుగా జీతాలు కూడా లేవు. మేమేం పాపం చేశాం. మాకూ కుటుంబాలు ఉన్నాయి. మేం పండగలు చేసుకోవద్దా. సంతోషంగా ఉండొద్దా...’
– ఆబ్కారీశాఖలో ఎస్సైగా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ ఆవేదన ఇది.
ఈ మహిళ ఒక్కరే కాదు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ ఎస్సైలుగా ఎంపికైన సుమారు 280 మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ‘కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాం. ఇక ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండొచ్చని భావిస్తున్న తరుణంలో రెండేళ్లుగా అటు పోస్టింగుల్లేక, పది నెలలుగా జీతాలు అందక బాధలు పడుతున్నామ’ని మరో మహిళా ఎస్సై తెలిపారు. గతంలో చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఆబ్కారీశాఖలో అడుగు పెట్టిన మరికొందరు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
చదవండి: నా భర్తను అంతం చేయాలని ఎర్రబెల్లి కుట్ర
ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు..
► 2015లో గ్రూపు–2 పరీక్షలు రాసి పోటీలో నెగ్గి చివరకు 2019లో ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికైన ఉద్యోగులకు రెండేళ్లు దాటినా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారంతా నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆబ్కారీ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
► నియామకపత్రాలు అందుకున్న ఉద్యోగుల్లో 193 మందిని పలు ఎక్సైజ్ స్టేషన్‌లకు అటాచ్ చేశారు.కానీ వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు.
► అలాగే మరో 87 మందిని ఎక్సైజ్ అకాడమీకి పంపించారు. సాధారణంగా ప్రతి ఎస్సైకి విధి నిర్వహణ పరిధి ఉంటుంది. కానీ ఎక్సైజ్ స్టేషన్‌లకు అటాచ్ అయిన ఏ ఒక్క ఎస్సైకి కూడా ఇప్పుడు ఆ పరిధి లేదు. ప్రతి రోజు కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లవలసిందే. ఇంచుమించు అకాడమీలో ఉన్నవాళ్లు కూడా అంతే.
► ‘తాత్కాలిక పదోన్నతులపైన నిబంధనలను బేఖాతరు చేశారు. మా కోసం సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించారు. విధి నిర్వహణ లేని ఆ పోస్టుల్లో మేం బలిపశువులుగా మారాం.’ అని మరో ఎస్సై తెలిపారు.
చదవండి: ‘జువెనైల్’ ఉన్నట్లు నాకు తెలియదు!
అలా తిష్ట వేశారు..
గతంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఎస్‌ఐలుగా తాత్కాలిక (అడ్‌హక్)పదోన్నతులిచ్చారు. గ్రూపు–2లో ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగాలు పొందిన వాళ్లకు పోస్టింగులు ఇవ్వాలంటే ఈ తాత్కాలిక ఉద్యోగులను వెనక్కు పంపించాలి. లేదా కొత్తవాళ్ల కోసం మరిన్ని పోస్టులను సృష్టించాలి. కానీ 87 మందికి మాత్రమే సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించారు.ఈ ఏడాది జనవరితో ఆ గడువు ముగియడంతో జీతాలు నిలిచిపోయాయి. మిగతా వాళ్లను స్టేషన్‌లకు అటాచ్ చేసినా విధులు మాత్రం లేకపోవడం గమనార్హం.
జీతాల్లేక విలవిల...
► సూపర్‌న్యూమరీ పోస్టుల కోసం ఇచి్చన గడువు ముగియడంతో జీతాలు ఇవ్వడం అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఫలితంగా సబ్ ఇన్‌స్పెక్టర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.కొంతమందికి కుటుంబపోషణ భారంగా మారింది.
► ఇంటి అద్దెలు, నిత్యాసవరాలు, పిల్లల ఫీజులు తదితర అవసరాలకు ఎంతో కష్టంగా ఉందని పలువురు ఆవేదన చెందారు. ప్రైవేట్ సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నట్లు మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment