
తెలంగాణలో ఎరువుల కొరత లేనేలేదు... అడిగిన దానికంటే ఎక్కువగానే కేంద్రం ఇచ్చింది
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే కృత్రిమ కొరత: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎరువుల కొరత లేదని, కావాలనే కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. మంగళవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎరువుల కొరతపై మీడియాలో కథనాలు రావటంతో నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాను.
రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువ కోటా ఎరువులు విడుదల చేశామని కేంద్రం స్పష్టత ఇచి్చంది. 2024–25 రబీ సీజన్‌లో 9.5 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరమైతే, 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపింది. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
గత పదేళ్లుగా దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’అని విమర్శించారు.
27 శాతం అధికంగా సరఫరా
గత ఏడాది అక్టోబర్1 నుంచి ఈ నెల 22 వరకు కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 27.37 శాతం అధికంగా ఎరువులు సరఫరా చేశామని చెప్పారు. ఈ నెల 22న 40 వేల టన్నుల యూరియాను కేంద్రం అదనంగా పంపిందని వెల్లడించారు. 23, 24 తేదీల్లో అదనంగా మరో 48 వేల టన్నుల యూరియా పంపిస్తున్నట్లు కేంద్రం తెలిపిందని వివరించారు.
లెక్క ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇదిగాక 6 వేల టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదిలాబాద్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకే అత్యధికంగా ఎరువుల సరఫరా చేస్తున్నామని చెప్పారు. యూరియాను రైతులకు సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి ద్వారా తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment