కొత్త వేరియంట్‌ వస్తే ముందుగానే మూడో వేవ్‌ | Third Wave Likely August, Peak In September: SBI Research Report | Sakshi
Sakshi News home page

కొత్త వేరియంట్‌ వస్తే ముందుగానే మూడో వేవ్‌

Published Tue, Jul 6 2021 3:43 AM | Last Updated on Tue, Jul 6 2021 8:48 AM

Third Wave Likely August, Peak In September: SBI Research Report - Sakshi

సెప్టెంబర్‌ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్‌ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. రెండో వేవ్‌ కన్నా మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు రావొచ్చని పేర్కొంది. అంటే రోజువారీ కేసులు 6 లక్షల వరకూ వెళ్లొచ్చని తెలిపింది. 

ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్‌ మొదలై.. అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో కేసులు పతాక స్థాయికి చేరొచ్చని కాన్పూర్‌ ఐఐటీ అంచనా వేసింది. కొత్తగా వచ్చే వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. రోజువారీ కేసులు రెండు లక్షలకుపైగా నమోదుకావొచ్చని తెలిపింది. కొత్త వేరియంట్‌ ఏదీ రాకపోతే ఆగస్టు చివరినాటికి కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని పేర్కొంది. ఎస్‌బీఐ, కాన్పూర్‌ ఐఐటీ మోడళ్లు రెండూ కూడా మూడో వేవ్‌లో కరోనా ప్రమాదకరంగా మారకపోవచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కేసులు భారీగా పెరిగినా ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేశాయి. 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా రెండో వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2 నెలల కింద రోజుకు 4 లక్షల దాకా వెళ్లిన కేసులు.. ఇప్పుడు 30–40 వేల మధ్య నమోదవుతున్నాయి. ఇలాగే మరో 3, 4 వారాలు తగ్గుతాయని.. ఆ వెంటనే మూడో వేవ్‌ మొదలయ్యే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కాన్పూర్‌ ఐఐటీల అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌లు, ఆంక్షలు సడలించడంతో జనం బయటికి రావడం పెరిగిందని.. వారు కోవిడ్‌ జాగ్రత్తలు పాటించకుంటే ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్‌ మొదలవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు నివేదికలు విడుదల చేశాయి.

రెండో వేవ్‌ పూర్తిగా తగ్గకముందే.. 
గత ఏడాది జనవరిలో కరోనా పంజా విసరడం మొదలైంది. తొలిదశలో మెల్లమెల్లగా కేసులు పెరిగాయి. అక్టోబర్‌ నాటికి పతాక స్థాయికి చేరి.. తర్వాత తగ్గిపోయాయి. ఇక రెండో వేవ్‌ ఈ ఏడాది మార్చిలో మొదలుకాగా.. మే ఏడో తేదీన ఏకంగా 4.14 లక్షల కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వస్తున్నాయి. రెండో వేవ్‌లో కేసులు భారీగా పెరగడం, లక్షలకొద్దీ యాక్టివ్‌ కేసులు ఉండటంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కోసం తీవ్ర సమస్య ఎదురైంది. రోజూ 3, 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే త్వరలోనే మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్‌ ఎప్పుడు రావొచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇదే తరహాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐఐటీ కాన్పూర్‌ వేర్వేరుగా అధ్యయనం చేసి నివేదికలు విడుదల చేశాయి. రెండూ కూడా ఆగస్టు మధ్యలో కరోనా మూడో వేవ్‌ ప్రారంభం కావొచ్చని పేర్కొన్నాయి. 
 
నెల రోజుల్లోనే గరిష్ట స్థాయికి.. 
దేశంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘కోవిడ్‌ 19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరిట సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న వేళ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించకపోతే.. ఆగస్టు రెండో వారంలోనే మూడో వేవ్‌ మొదలవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేవలం నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్‌ మధ్య నాటికే కేసులు పతాక స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వెళ్తాయని, ఈ నెల మూడో వారానికి రోజుకు పది వేలకు పడిపోతాయని పేర్కొంది. ఆ తర్వాత కేసులు పెరగడం మొదలవుతుందని.. మూడు, నాలుగు వారాల్లోనే గరిష్ట స్థాయికి చేరుతాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేవ్‌లు, నమోదైన కేసులను బట్టి.. రెండో వేవ్‌ కంటే మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదు కావొచ్చని పేర్కొంది. 
 
వ్యాక్సిన్‌తోపాటు జాగ్రత్తలూ తప్పనిసరి 
కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక మార్గమని, కానీ అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి అని స్టేట్‌ బ్యాంక్‌ రీసెర్చ్‌ నివేదికలో ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం 4.6 శాతం మందికి రెండు డోసులు, 20.8 శాతం మందికి ఒక డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని.. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. 59.8 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ చేసిన ఇజ్రాయెల్, 48.7 శాతం వ్యాక్సినేషన్‌ చేసిన బ్రిటన్‌ దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా కూడా మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 
 
కొత్త వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. 
ఐఐటీ కాన్పూర్‌ కూడా తాము రూపొందించిన ‘సూత్ర’ మోడల్‌తో దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేసింది. రెండో దశలో దేశాన్ని వణికించిన డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపించగల కొత్త వేరియంట్‌ వస్తే మూడో దశలోనూ కోవిడ్‌ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం.. కొత్త వేరియంట్‌ ఏదీ రాకపోతే ఆగస్టు చివరికల్లా రెండో దశ పూర్తి నియంత్రణలోకి చేరుకుంటుంది. ఒక వేళ కొత్త వేరియంట్‌ వస్తే.. ఆగస్టు మధ్యలోనే మూడోదశ మొదలై.. అక్టోబర్, నవంబర్‌ నెలల మధ్య పతాక స్థాయికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో రోజువారీ కేసులు యాభై వేల నుంచి లక్ష వరకూ ఉండొచ్చు. ఒకవేళ డెల్టా కంటే 25 శాతం వేగంగా వ్యాప్తి చెందగల కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే.. రోజువారీ కేసులు 1.5 లక్షల నుంచి రెండు లక్షలకుపైగా నమోదయ్యే అవకాశం ఉంది. 
 
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. 
జనం రోగ నిరోధక శక్తిని కోల్పోవడం, టీకాల ప్రభావం, తీవ్రమైన కొత్త వేరియంట్‌ వచ్చే అవకాశాలను ఈ అంచనాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నామని ఐఐటీ కాన్పూర్‌ అధ్యాపకుడు మణిందర్‌ అగర్వాల్‌ తెలిపారు. కొత్త వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఏమవుతుంది?, డెల్టా వైరస్‌ కంటే పాతికశాతం ఎక్కువ వేగంగా (డెల్టా ప్లస్‌ వ్యాపించే వేగం డెల్టా కంటే తక్కువని అంచనా) వ్యాప్తి చెందగల వేరియంట్‌ వస్తే జరిగే పరిణామాలను పరిశీలించామన్నారు. డెల్టా వైరస్‌ అప్పటికే ఇతర వేరియంట్లతో జబ్బుపడ్డ వారిపై ఎక్కువగా దాడి చేస్తోందని, ఈ లెక్కన చూస్తే మూడో దశలో కేసులు మునుపటి స్థాయిలో ఉండవని అగర్వాల్‌ వివరించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4.6 శాతం మందికి రెండు దశల టీకాలు ఇవ్వడం, మరో 20.3 శాతం మంది కనీసం ఒక్క డోసుతో రక్షణ కలిగి ఉండటం వల్ల.. మూడు, నాలుగో దశల తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. మూడో వేవ్‌లో ఆస్పత్రిలో చేరే కోవిడ్‌ బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ ఏడాది జనవరిలో రోజుకు అరవై వేల కేసులు, 1,200 మరణాలు నమోదు కాగా.. తర్వాతి దశలో గరిష్ట కేసులు 21 వేలకు, మరణాలు 14కు పడిపోయాయని సూత్ర మోడల్‌ తయారీలో పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్‌ గణిత శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement