సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధిలోకి వచ్చే గ్రామాలను ప్రకృతి వ్యవసాయ (ఆర్గానిక్ ఫామింగ్) జోన్‌గా ప్రకటించాలని, రెండు జలాశయాల్లో పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవో 111 అధ్యయన కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, కన్వినర్ సంగిశెట్టి జగదీశ్వరరావు నేతృత్వంలోని బృందం తాము రూపొందించిన నివేదికను బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డికి అందజేసింది.
జీవో 111 ప్రాంతంలో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తించాలని, ప్రత్యేక ప్యాకేజీ కింద వారికి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రెండు విడతల ఆర్థిక సాయం అందజేయాలని కోరింది. అక్కడ ప్రకృతి ఆధారిత పంటలు పండించేలా ప్రోత్సాహమివ్వాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ పరిశోధనశాలలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరింది.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రైతుల ఇష్టంతో భూములు అమ్ముకున్నప్పటికీ, కొనుగోలు చేసిన వారు కూడా వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గుర్తింపు కార్డు లు ఇవ్వాలని కోరింది. జీవో111కు బదులు సమగ్రమైన చట్టాన్ని తేవాలని పేర్కొన్నారు.
పర్యావరణంపై సీఎంకు అవగాహన లేదు: కోదండరెడ్డి
తమ నివేదికను రేవంత్‌కు ఇచ్చిన అనంతరం గాం«దీభవన్‌లో సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అధ్యయన కమిటీ సభ్యులతో కలసి కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 111 జీవో పరిధిలోని 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని, వారి ఫాంహౌస్‌లు మునిగిపోకుండా ఉండేందుకే హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండకముందే గేట్లు తెరిచారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌కు పర్యావరణంపై అవగాహ న లేదని, కేటీఆర్ అవగాహనరాహిత్యం వల్ల జంట జలాశయాలకు ముప్పు వాటిల్లుతోందని చె ప్పారు. రియల్టర్ల కోసమే జీవో 111ను ఎత్తివేశారని, ఈ జీవో పరిధిలో అన్ని నిబంధనలూ పేదలకే వర్తింపజేస్తున్నారని, పెద్దలు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తమ అధ్యయనంలో తేలిందని కోదండరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment