ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదలతో రైతులు నష్టపోతే.. సీఎం కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన సందర్భం ఇదా? అసలు మానవత్వం ఉన్న వారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలు వస్తే కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. అధికారిక లెక్కల ప్రకారం వరదల్లో 40 మంది చనిపోయారని, 20 లక్షల ఎకరాల్లో రూ.5వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందన్నారు.
ఇలాంటి పరిస్థితు ల్లో అఖిలపక్షం తీసుకుని ఢిల్లీ వచ్చి ప్రధాని, హోంమంత్రిని కలిసి నిధులు కోరాల్సిన ముఖ్యమంత్రి... వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏమాత్రం సిగ్గులేకుండా మహా రాష్ట్రకి వెళ్లి పార్టీ ఫిరాయించిన వారికి కేసీఆర్ కండువా కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వరదలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి నిరసన తెలిపారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీఎం ఢిల్లీకి వచ్చి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని... కేంద్రం తెలంగాణను ఆదుకోకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేసి వరద సహాయం సాధిస్తామని తెలిపారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహా రం ఇవ్వాలని, పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు మానవత్వం లేదు
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్‌కి మానవత్వం లేదని, రైతులను ఆదుకోకుంటే త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని... రాగానే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ రైతు రుణమాఫీ అమలు చేయలేదని.. కాంగ్రెస్ కౌలు రైతులను కూడా ఆదుకుంటుందన్నారు. తెలంగాణలో పంట నష్టం జరిగితే కేసీఆర్ ఎందుకు ఢిల్లీ రాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment