
ఇల్లందకుంట (కరీంనగర్): తెలంగాణ ఉద్యమం లో పులిబిడ్డల్లా కొట్లాడిన ఉద్యమకారులు కేసీఆర్ నిరంకుశ ధోరణి వల్ల ఇప్పుడు బజారులో పడ్డారని, ప్రగతిభవన్ బానిస బతుకు నుంచి తాను బయటపడ్డానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లిలో గురువారం ప్రజాదీవెన యాత్ర ప్రారంభానికి ముందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు, ఉపఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కొత్త పథకాలకు రూపకల్పన చేస్తా రని.. వాటి ద్వారా ఓట్లు రాబట్టేలా స్కెచ్ వేస్తారని విమర్శించారు.
ఉద్యమ కారులను బయటకు పంపి నమ్మకద్రోహులను పార్టీలోకి చేర్చుకుంటున్నా రని విమర్శించారు. తన మాటలకు ఎదురు చెప్పేవాడు తెలంగాణ గడ్డ మీద ఉండకూడదని కేసీఆర్ భావిస్తారని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదని, తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇండ్ల గురించి మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏ మాత్రం పనులు పూర్తి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.