సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ ఎన్టీఆర్ నామస్మరణ చేసింది. జై తెలంగాణ, జై కేసీఆర్‌తో పాటు కొత్తగా జై ఎన్టీఆర్ అంటూ టీఆర్‌ఎస్ నేతలు కొత్త నినాదం అందుకున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించేందుకు బారులు తీరారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ఘనంగా నివాళి అర్పించారు.
ఇన్నాళ్లూ ఎన్నడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్‌ఎస్.. ఇప్పుడు ఒక్కసారిగా జై ఎన్టీఆర్ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. నివాళి అర్పించిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలంతా గతంలో టీడీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. దీని వెనుక హైదరాబాద్‌లో ఓటర్లకు గాలం వేయడం, ఓ సామాజికవర్గం మద్దతు కూడగట్టడమే గులాబీ పార్టీ లక్ష్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళి అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, చామకూర మల్లారెడ్డి, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మరికొందరు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు.
తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారంటూ..
‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా.. ఎన్టీఆర్ కా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది)’అని టీఆర్‌ఎస్ నేతలు నినదించడం గమనార్హం. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందంటూ ప్రకటనలు విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో చరిత్ర సృష్టించిన తెలుగు బిడ్డకు నివాళి అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఎన్టీఆర్ కేంద్రం మెడలు వంచి జాతీయ నాయకుడిగా పనిచేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నందున దివంగత నేత ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చాం. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం పార్లమెంటులో పోరాడుతాం. బడుగు బలహీనవర్గాలకు పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఆయనదే. కేసీఆర్ కూడా రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు..’’అని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.
అంతా పక్కాలెక్కతోనే..
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా ఏనాడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్‌ఎస్.. ఆయన శత జయంతి రోజు ఏకంగా జై ఎన్టీఆర్ అంటూ నినదించడం చర్చనీయాంశమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఇక్కడ శాసనసభ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు.. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం కోసం సదరు సామాజికవర్గం మద్దతు అవసరమని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఈ సామాజికవర్గం ఓటర్లను టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పోలరైజ్ చేసేందుకే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదాన్ని బలంగా వినిపించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపు అంతర్ధానం కాగా.. అక్కడక్కడా మిగిలి ఉన్న సానుభూతిపరులు, కేడర్‌ను టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలో భాగంగా జై ఎన్టీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నాయి. మరోవైపు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు వరుస పర్యటనలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేసీఆర్.. ‘తెలుగు కుటుంబం’అనే భావనను తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే టీడీపీ మాజీలైన ప్రస్తుత టీఆర్‌ఎస్ నేతలు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా హడావుడి చేసినట్టు చెప్తున్నాయి.
ఓవైపు పార్టీ.. మరోవైపు సామాజికవర్గం
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన వారిలో ఒకరిద్దరు మినహా కీలక నేతలంతా గతంలో టీడీపీలో పనిచేసినవారే. అందులోనూ ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన నేతల్లో హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు చెప్పుకొస్తున్నా.. ఈ కొత్త నినాదం వెనుక ఓట్లు, సీట్ల రాజకీయం దాగి ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
2014లో టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్, భాస్కర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరి రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రస్తుతం టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వర్‌రావు కూడా టీడీపీ నుంచే వచ్చారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి గతంలో టీడీపీలో క్రియాశీల నేతలే. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సుదీర్ఘకాలంలో టీడీపీలోనే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, భాస్కర్‌రావు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కూడా.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద...
మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుం బసభ్యులు, అభిమానులు, నేతలు ఘనంగా నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు పలు వురు సినీనటులు, ఏపీ రాజకీయ నాయకులు నివాళి అర్పించారు. అటు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఈ విగ్రహదాత కాగా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్‌నగర్ సొసైటీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే టీఆర్‌ఎస్ నివాళులు
ఎనిమిదేళ్లుగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలోనే ఉంటుందని.. ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్‌ఎస్ నేతలకు లేదని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు
భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకుడు, చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని శనివారం ఒక ప్రకటనలో కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment