సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజు నియంత్రణకు ఫీజు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసిన తరహాలో ప్రైవేటు పాఠశాలలకూ ప్రత్యేక విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి కడప వెంకట్ సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది యాకారపు షీలు వాదనలు వినిపించారు.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఈ పిల్‌లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీబీఎస్‌ఈ, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్, ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణన నవంబర్ 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment