మాట్లాడుతున్న ∙ఎ.గోపాల్‌రావు
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు.
విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు.
ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్‌రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment