
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్త బస్సుల కొరత నెలకొంది. నాలుగేళ్ల కిందట తొలిసారి వెయ్యి, ఆ తర్వాత మరో 300 వరకూ కొత్తవి కొన్నా.. ప్రస్తుతం వాటిలోనూ చాలా వరకు పాతబడిపోయాయి. దూర ప్రాంతాలకూ డొక్కు బస్సులే తిప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తవాటి కొనుగోళ్లపై ఆర్టీసీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఇప్పుడు ఇది కూడా కీలకంగా మారనుంది. ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసి దూరప్రాంతాలకు నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీలో మాత్రం కొత్తవి సరిపోవట్లేదు. ఏపీఎస్ ఆర్టీసీ కొత్తవి తిప్పుతుంటే, ఆ ప్రాంతానికి తెలంగాణ ఆర్టీసీ పాతవి తిప్పాల్సి వస్తోంది. ఇటీవల రెండు ఆర్టీసీలూ సమ సంఖ్యలో అంతర్రాష్ట్ర బస్సులు నడపాలనే చర్చ వచ్చినప్పుడు, ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ కూడా కొత్తవి నడపాల్సిన అవసరం ఏర్పడింది. ఉన్న బస్సుల్లోనూ చాలా వరకు పాతపడి, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2016–17లో కొన్న గరుడ, గరుడ ప్లస్ బస్సులు చాలా వరకు పాతబడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఉన్న హైఎండ్ మోడల్ మల్టీ యాక్సిల్ బస్సు ల్లో స్కానియా కంపెనీవి కొత్తవి. గరిష్టంగా ఏడున్నర లక్షల కి.మీ.తిరగాల్సిన ఈ బస్సు లు ఇప్పటికే 5 లక్షల కి.మీ. పూర్తి చేసుకున్నా యి. వీటిల్లోనూ కొన్ని వెంటనే అవసరం.
1,100 బస్సులు కావాలి..
ఆర్టీసీకి 6,850 సొంత, మరో 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సొంత వాటికి సంబంధించి దాదాపు 1,500 వరకు బాగా పాతబడిపోయాయి. వాటిల్లో కొన్నింటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు 1,100 వరకు కొత్త బస్సులు అవసరమవుతున్నాయి. వీటిల్లో 60 వరకు మల్టీయాక్సిల్‌వి కావాలి. మరో 150 వరకు రాజధాని ఏసీ, మిగతావి సూపర్ లగ్జరీ అవసరమవుతాయి. వీటిల్లో మల్టీయాక్సిల్ బస్సు దాదాపు రూ.కోటిన్నర ధర పలుకుతోంది. రాజధాని–రూ.55 లక్షలు, సూపర్ లగ్జరీ రూ.36 లక్షల వరకు ధర ఉంటుంది. ఇక సాధారణ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్కన 1,100 బస్సులకు దాదాపు రూ.450 కోట్లు అవసరమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఇన్ని నిధులు లేనందున, ప్రభుత్వమే రుణంగానో, గ్రాంటుగానో సమకూర్చాల్సి ఉంటుంది.
అద్దె ప్రాతిపదికన తీసుకుంటే..
ఆర్టీసీలో కొంతకాలంగా అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. కొత్తవి సమకూర్చుకోవటం ఇబ్బందిగా మారడంతో అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. ఇప్పటి వరకు హైఎండ్ మోడల్ బస్సులను మాత్రం ఆర్టీసీ సొంతంగానే సమకూర్చుకుంది. ప్రస్తుతం నిధులకు ఇబ్బందిగా ఉండడంతో ఆ కేటగిరీ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవడంపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 3,500 వరకు అద్దె బస్సులుండగా, అంతమేర ఆర్టీసీ డ్రైవర్లకు పని లేకుం డా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికే దాదా పు ఐదారు వేల మంది ఎక్సెస్‌గా మారారు. కొత్తగా అద్దె బస్సులు తీసుకుంటే వారి సంఖ్య మరింత పెరిగి, ఆర్టీసీలో వేల మంది డ్రైవర్లకు పని లేకుండా పోతుంది. ఇప్పటికే దాదాపు 2 వేల మంది డ్రైవర్లకు ఇతర చిన్నా చితక పనులు అప్పగిస్తున్నారు. అవీ సరిపోక కొందరు ఊరకే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో డ్రైవర్ల సంఖ్య పెరిగితే వాలంటరీ రిటైర్మెంట్ పథకం వర్తింపచేయడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి, ప్రైవేటీకరించే సమయం లోనే వస్తుందని, ఇప్పుడు ఆ దిశగా యోచిస్తే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
రూ.700 కోట్లు ఇవ్వాలి
ప్రస్తుతం ఆర్టీసీలో 1,500 బస్సులు తుక్కుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తవి కొనాలి. ఏపీఎస్ ఆర్టీసీతో ఒప్పందంలో భాగంగా లక్ష కి.మీ. పెంచుకోవద్దన్న నిర్ణయం వెనుక బస్సుల కొరతే కారణం. దీంతో కొత్త బస్సులు కొని లక్ష కి.మీ. ప్రయాణ నిడివిని ఏపీలో టీఎస్ ఆర్టీసీ పెంచుకోవాలి. కొత్తవి కొంటేనే మన ఆర్టీసీ ప్రతిష్ట ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం రూ.700 కోట్ల మొత్తం గ్రాంటుగా ఇవ్వాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి