ముస్తాబైన మ్యాన్‌రైడింగ్ చైర్‌కార్
బొగ్గు ఎలా తవ్వుతారు.. అసలు నేలలో బొగ్గు నిక్షేపాలు ఎలా ఉంటాయి.. తోడిన బొగ్గును బయటకు ఎలా తీస్తారు.. బొగ్గులో రకాలెన్నుంటాయి.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు.. ఈ ప్రశ్నలకు ఎవరో సమాధానాలు చెప్పడం కంటే, ప్రత్యక్షంగా ఆ ప్రక్రియలను తిలకిస్తే ఎంత బాగుంటుంది. కానీ, అలా నేరుగా చూసే భాగ్యం సామాన్యులకు దక్కడం కుదరదు. దాన్ని సాకారం చేసేలా ఇప్పుడు ఆర్టీసీ–సింగరేణి సంయుక్తంగా ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. రూ.1,600 చెల్లిస్తే చాలు.. వీటన్నింటినీ దగ్గరుండి నేరుగా చూసి మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు.
– సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని
ఇదీ ఆ ప్రాజెక్టు..
దేశంలో ఉత్పత్తయ్యే బొగ్గులో 10 శాతానికిపైగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు ప్రసాదిస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బొగ్గు–పర్యాటకానికి తెర తీశారు. ఇందులోభాగంగా ఇటీవలే ఆయన సింగరేణి అధికారులతో మాట్లాడి సంయుక్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
దీన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. బుక్ చేసుకునే పర్యాటకుల తొలి బస్సు ఈనెల 28న సింగరేణికి వెళ్లనుంది. జనవరి నుంచి ప్రతీ శనివారం ఒక సూపర్‌లగ్జరీ బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండు నుంచి బయలుదేరుతుంది. పర్యాటకుల రద్దీ పెరిగితే ఈ ట్రిప్పుల సంఖ్య పెంచుతారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.1,600గా నిర్ణయించారు.
ఫిబ్రవరి నుంచి దాన్ని రూ.1,850గా సవరించాలని భావిస్తున్నారు. ఉదయం జూబ్లీ బస్టాండులో బయలుదేరే బస్సు నేరుగా గోదావరి ఖనిలోని 7 ఇంక్లైన్ బొగ్గుగనికి చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలుత భూగర్భ గనిలో బొగ్గు తవ్వే విధానాన్ని చూపుతారు. ప్రత్యేక కన్వేయర్ ద్వారా వందల అడుగుల లోతులోని భూగర్భ గనిలోకి తీసుకెళ్లి చూపుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి ఓపెన్‌కాస్ట్ గని వద్దకు తీసుకెళ్తారు. బొగ్గు తవ్వేందుకే జరిపే పేలుళ్లు మొదలు తవ్వి పైకి తెచ్చే వరకు చూపుతూ వివరిస్తారు. తర్వాత అక్కడికి చేరువలో ఉన్న జైపూర్ పవర్‌ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి తీరును ప్రత్యక్షంగా చూపుతారు.
జీడీకే–7ఎల్‌ఈపీ గని స్వాగత ద్వారం
బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చార్జి అదనం
నగరం నుంచి బయలుదేరాక సిద్దిపేట సమీపంలో ఓ హోటల్ వద్ద బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అందుకయ్యే రూ.99ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి అండర్‌గ్రౌండ్ బొగ్గుగనిలోకి వెళ్లేటప్పుడు ఉచితంగా టీ, స్నాక్స్ ఇస్తారు. మధ్యాహ్నం అక్కడి గెస్ట్‌హౌజ్‌లో ఉచితంగా లంచ్ ఏర్పాటు చేస్తారు. తిరుగుప్రయాణంలో మళ్లీ సిద్దిపేట సమీపంలోని హోటల్లో డిన్నర్ ఉంటుంది. ఆ చార్జీని ప్రయాణికులే భరించాలి. ప్రస్తుతం ఈ ట్రిప్ చార్జీగా వసూలు చేసే రూ.1,600 నుంచి సింగరేణికి రూ.300 చెల్లిస్తారని సమాచారం. అందులో ఎంట్రి టికెట్, లంచ్ చార్జీ కలిసి ఉంటాయి.
నేడు లాంఛనంగా ప్రారంభం
సింగరేణి దర్శన్ యాత్రను మంగళవారం ఉదయం బస్‌భవన్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సింగరేణి డైరెక్టర్లు ఎస్,చంద్రశేఖర్, ఎన్.బలరాం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి ప్రారంభిస్తారు. తొలి ట్రిప్పు ఈనెల 28న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.
చైర్‌కార్ ద్వారా గనిలోకి..
పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సంస్థ గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మ్యాన్‌రైడింగ్ చైర్‌కార్ ద్వారా గనిలోకి తీసుకెళ్లి బొగ్గు ఉత్పత్తి, యాంత్రీకరణ, అంశాలను చూపిస్తాం. గని ముందున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పర్యాటకులు పెరిగితే అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడైతే వారంలో ఒకసారి సందర్శన ఉండేలా నిర్ణయించాం.
– ఎ.మనోహర్, జీఎం, ఆర్జీ–2
Comments
Please login to add a commentAdd a comment