TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. సజ్జనార్‌ కీలక ప్రకటన | TSRTC MD VC Sajjanar Key Comments Over New Buses | Sakshi
Sakshi News home page

TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. సజ్జనార్‌ కీలక ప్రకటన

Published Fri, Dec 22 2023 7:48 PM | Last Updated on Fri, Dec 22 2023 7:58 PM

TSRTC MD VC Sajjanar Key Comments Over New Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందన్నారు.  

అయితే, హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని,  వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

ఈ క్రమంలో సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం’ అని తెలిపారు.

ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉందని వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ కృష్ణకాంత్,  సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement