
కణితి లింగవ్వ (ఫైల్)
దుమ్ముగూడెం/నిర్మల్: ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్రల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు– మావోయిస్టులకు నడుమ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళా డివిజనల్ కమిటీ(డీవీసీ) కమాండర్‌సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కణితి లింగవ్వ (40) అలియాస్ అనిత మృతి చెందినట్టు సమాచారం.
రెండు రాష్ట్రాల పోలీసులతోపాటు మహారాష్ట్రకు చెందిన సీ–60 కమాండోలు, బీజాపూర్‌కు చెందిన బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నేషనల్ పార్క్ టకామెటా ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా, ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఇరువర్గాల నడుమ కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ అలియాస్ అనిత తలపై తెలంగాణలో రూ.5 లక్షలు, మహారాష్ట్రలో రూ.16 లక్షలు నజరానా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన రాజవ్వ, రాజన్న దంపతులకు ముగ్గురు సంతానం. అందులో లింగవ్వనే పెద్దది. ఆమెకు రమేశ్, రవి ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. గోదావరి పరీవాహక ప్రాంతమైన లక్ష్మీసాగర్‌కు అప్పట్లో నక్సల్స్ దళాలు తరచూ వస్తుండేవి. ఈ క్రమంలో వాళ్ల పాటలు, మాటలకు ఆకర్షితురాలైన లింగవ్వ 1997లో యుక్తవయసులోనే దళంలో చేరింది. లింగవ్వ తమ్ముడు కంతి రవి అలియాస్ సురేశ్ సైతం కొన్నాళ్లు దళంలో పనిచేసి 2016లో పోలీసులకు లొంగిపోయాడు. లింగవ్వ మాత్రం భర్త అడెల్లుతోనే దళంలోనే కొనసాగింది.
బిడ్డ తిరిగొస్తదనుకున్నా: లింగవ్వ తల్లి రాజవ్వ
‘పుట్టిన ఒక్కగానొక్క ఆడిబిడ్డ మమ్మల్ని ఇడిసి అడివిలకు పోయింది. ఎప్పటికైనా నా బిడ్డ ఇంటికి తిరిగొస్తదనుకున్న. ముసలితనంలనైనా లింగవ్వను చూస్తానుకున్న. కానీ.. ఇట్లయితదను కోలేదు..’అంటూ కంతి లింగవ్వ తల్లి రాజవ్వ కన్నీరుమున్నీరవుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన విషయం శుక్రవారం సాయంత్రం తర్వాత కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి లక్ష్మీసాగర్ గ్రామంలో విషాదం అలుముకుంది’
Comments
Please login to add a commentAdd a comment