సాక్షి, హైదరాబాద్: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో కిందిస్థాయి గాలులు నైరుతి దిక్కు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, భీమినిలలో 11 సెంటీమీటర్లు, ఘన్‌పూర్, తాడ్వాయి, భీమదేవరపల్లిలలో 10 సెంటీమీటర్లు, జగిత్యాల, ధర్మసాగర్, చేవెళ్ల, దిండిగల్, చిగురుమామిడి, ఖానాపూర్, చెన్నారావుపేట, హసన్‌పర్తి ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment