సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నారు. లక్షణాలు లేకుండా సోకు తుండటంతో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో అంతుబట్టడం లేదు. కరోనా వైరస్‌లో మార్పుల (మ్యుటేషన్ల) కారణంగా దాని వ్యాప్తి గతం కంటే గణనీయంగా పెరిగింది. ఊహ కందని వేగంతో వైరస్ విస్తరిస్తోంది. భారత్‌లో గతేడాది మొదటివేవ్‌లో కేసులు తారస్థాయికి చేరడానికి ఏడు నెలల సమయం పడితే... సెకండ్ వేవ్‌లో కేవలం రెండు నెలల్లోనే కేసులు ఆ స్థాయికి చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో కరోనా వ్యాప్తి భారీగా ఉంది. గతేడాది సెప్టెంబర్ 21వ తేదీకి మొదటి వేవ్ పతాక స్థాయికి చేరుకుంది. ఆ వారంలో 6.46 లక్షల కేసులు నమోదయ్యాయి. 8,166 మంది మృతి చెందారు.
కరోనా మొదటి వేవ్ పీక్‌కు చేరుకోవడానికి ఏడు నెలల సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఆ స్థాయి తీవ్రత దాదాపు రెండు నెలల్లోనే కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. సెకండ్ వేవ్‌లో గత వారంలో ఇండియాలో 5.13 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే వారంలో 3,071 మరణాలు సంభవించాయి. మొదటి వేవ్ తీవ్రత సమయంలో ఎలాంటి భయానక పరిస్థితి ఉందో ఇప్పుడూ అలాంటి తీవ్రతే ఉంది. అయితే మరణాలు గణనీయంగా తగ్గడం గుడ్డిలో మెల్ల. ఇక దీన్ని ఆధారం చేసుకొని తెలంగాణలో పరిస్థితిని ఇక్కడి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొదటివేవ్ తారాస్థాయికి చేరిన సెప్టెంబర్‌లో మూడో వారంలో 16,201 కేసులు, 78 మరణాలు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో చూస్తే గత వారంలో తెలంగాణలో 7,873 కేసులు రాగా, 33 మరణాలు సంభవించాయి. మన రాష్ట్రంలో మొదటి వేవ్‌లోని తీవ్రతలో 50 శాతం సెకండ్ వేవ్‌లో నెల రోజుల్లోనే కనిపిస్తుండటం గమనార్హం.
ఒక కాంటాక్టు నుంచి 24 శాతం మందికి
మన దేశంలో మొదటి వేవ్‌లో తీసుకుంటే... ఒక కరోనా రోగి తనకు సన్నిహితంగా మెలిగిన వారిలో 17 శాతం మందికి వైరస్ వ్యాపింపజేస్తే, ఇప్పుడు 24 శాతం మందికి అంటిస్తున్నారు. అంటే ప్రైమరీ కాంటాక్టుల్లో వ్యాధి సోకుతున్న వారి సంఖ్య (శాతం) పెరిగింది. ఇలా ఒకరి నుంచి ఒకరికి అదే స్థాయిలో విస్తరణ పెరుగుతూ వస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే, అతనితో సమీపంగా మెలిగిన 25 మందికి 72 గంటల్లోగా కరోనా నిర్దారణ పరీక్ష చేయాలని నిర్ణయించింది. ట్రేసింగ్, టెస్టింగ్ మూలంగా ఇప్పుడు కుప్పలుతెప్పలుగా కేసులు వస్తున్నాయి. ఆ మధ్య పాఠశాలలు, ఇప్పుడు షాపింగ్ మాల్స్, శుభకార్యాలు, విందులు, వినోదాల్లో పాల్గొన్న వారి ద్వారా కేసులు పెరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా వర్ని ప్రాంతంలో ఇటీవల ఒక పెళ్లికి వెళ్లివచ్చిన వారిలో 370 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తే, వారిలో ఏకంగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో ఇది తెలియజేస్తోంది. మొదటి వేవ్ గతేడాది లాక్‌డౌన్ తర్వాత మొదలైంది. అంటే ఒక రకంగా ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పట్లో భయంతో జనం జాగ్రత్తలు పాటించారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అక్టోబర్ నుంచి జనవరి దాకా చాలావరకు రిలాక్స్ అయ్యారు. అంతకుముందున్న భయం పోయింది. జాగ్రత్తలు చెప్పినా పాటించడంలేదు. ఇప్పుడు కూడా కరోనా లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సాధారణ లక్షణాలుగానే భావించి నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. జ్వరం, జలుబు వస్తే రొటీన్‌గానే చూస్తున్నారు. టెస్టుకు వెళ్లి ఐసోలేట్ కాకపోవడం మూలంగా వారి నుంచి ఇతరులకు సోకుతోంది.
యూకేలో థర్డ్ వేవ్‌లో భారీగా ప్రాణ నష్టం...
యూకేలో కొత్త స్ట్రెయిన్ కారణంగా అక్కడ థర్డ్ వేవ్‌లో అధిక కేసులు, మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఆ దేశంలో మొదటి వేవ్‌లో (గతేడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు) 2.50 లక్షల కేసులు నమోదయ్యాయి. 36 వేల మంది చనిపోయారు. 14.4 శాతం మరణాలు సంభవించాయి. అక్కడ ఆగస్టు నుంచి నవంబర్ వరకు సెకండ్ వేవ్ కొనసాగింది. సెకండ్ వేవ్‌లో 12 లక్షల కేసులు నమోదయ్యాయి. 23 వేల మంది చనిపోయారు. కేసులు పెరిగినా మరణాలు తగ్గాయి. థర్డ్ వేవ్ డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో ఏకంగా 43.59 లక్షల మందికి పాజిటివ్ వస్తే, 1.26 లక్షల మంది చనిపోయారు. యూకే వేరియంట్ (రూపాంతరిత వైరస్) వల్లే థర్డ్ వేవ్ వచ్చి బాగా దెబ్బతీసింది.
యూకే వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువ. 60 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. దానివల్లే కేసులు బాగా పెరిగాయి. మరణాలూ పెరిగాయి. ఇప్పుడు మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసులు చాలా వరకు విస్తరించాయని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలోనూ కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. దీంతో కరోనా విస్తరణ వేగం పెరిగింది. గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్ల వేగంతో వైరస్ విస్తరిస్తోంది.
కేసులు, మరణాలు పెరుగుతున్నాయి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో సెకండ్ వేవ్ విస్త్రృతి ఊహించలేని విధంగా ఉంది. దీంతో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గుర్తిస్తున్న కేసుల్లో ఔట్‌బ్రేక్స్‌లో కనుగొన్నవే ఎక్కువగా ఉన్నాయి. వారి కాంటాక్టులను పట్టుకోవడం ద్వారా గుర్తించినవే. అనుమానం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడే పరీక్షల ద్వారా కరోనాను గుర్తించవచ్చు. లక్షణాలు కనపడగానే గుర్తించకుండా సీరియస్ అయ్యాక అనేక మంది ఆసుపత్రులకు వస్తున్నారు.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
2 నెలల్లోనే తారస్థాయికి
Published Fri, Apr 9 2021 1:36 AM | Last Updated on Fri, Apr 9 2021 4:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment