మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
నార్నూర్: జ్వరం వస్తే వైద్య పరీక్షలు చేయించుకునేంత కూడా ఆర్థిక స్థోమతలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. వారం రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతున్నా మందులు కొనుగోలు చేయలేని దీనస్థితిలో ఇంటి ఇల్లాలిని కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధి ముక్తాపూర్ కొలాంగూడ గ్రామంలోని కొలాం గిరిజన తెగకు చెందిన మహిళ ఆత్రం ధర్మిబాయి(37) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది.
ఆమె వారం రోజులగా టైఫాయిడ్‌తో బాధ పడుతోంది. రెండు రోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించాడు. కాని నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక ఎలాంటి పరీక్షలు చేయించలేదు. చివరికి మందులు కూడా కొనుగోలు చేయకుండా ఇంటికి తిరిగొచ్చారు. మరునాడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా భారీ వర్షం కారణంగా సాధ్యపడలేదు. పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి భర్త నాగోరావు, ఇద్దరు కతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment