ముఖమండపంలో సహస్ర కలశాలకు పూజలు నిర్వహిస్తున్న ఆచార్యులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. ప్రధానాలయంలో నిత్య హవనాలు నిర్వహించిన అనంతరం ప్రథమ ప్రాకారంలోని యాగశాలలో పూర్ణాహుతి, ముఖమండపంలో సహస్ర కలశాలకు పూజలు, స్వయంభువులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ ప్రవచనం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, మంగళ నీరాజనం చేసి ఉత్సవాలను ముగించారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవురోజు కావడం, స్వామి జయంతి, స్వాతి నక్షత్రం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువుతో పాటు ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. 30 వేలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment