పాల్వంచ: కష్టపడి చిట్టీ కట్టగా, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (40) దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్ వద్ద రూ.25 లక్షల చిట్టీలు రెండు కట్టాడు. చివరి వరకు చెల్లించాక రూ.50 లక్షలు ఇవ్వాలని కోరితే తిప్పుతుండటంతో కేసు పెడుతామని చెప్పాడు. దీంతో బొల్లేరుగూడెం ఏరియాలోని 747 గజాల స్థలాన్ని వెంకటేశ్వరరావుకు రాసిచ్చాడు. కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయసాగాడు.
ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావుకు తెలియకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే స్థలాన్ని భానుకుమార్ అగ్రిమెంట్ చేశాడు. చివరికి వీరిద్దరికి కాకుండా మల్లెల దినేష్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ స్థలంలో దినేష్ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయని సమాచారం. అయినా తనకు న్యాయం జరగడం లేదని భావించిన వెంకటేశ్వరరావు గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మరణించాడు. కాగా, ఓ ఎమ్మెల్యే కుమారుడు, అధికార పార్టీ నేతలు, పోలీసులు కూడా తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైనట్లు వెంకటేశ్వరరావు పురుగు మందు తాగే ముందు ఎస్పీ పేరిట 43 మంది పేర్లతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయమై పాల్వంచ ఎస్‌ఐ రితీశ్‌ను వివరణ కోరగా.. చిటీ డబ్బు విషయంలో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య శ్రావణి ఫిర్యాదు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment