పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన చేస్తున్న కార్మికులు
సింగరేణి(కొత్తగూడెం) : తమ పని వేళలు మార్చాలంటూ కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకె-7 షాప్ట్‌లో జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కార్మికుల కథనం ప్రకారం.. బుచ్చిబాబు, రజాక్, నరేష్, అనే కార్మికులు వీకె-7షాప్ట్‌లో మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు. సీఎం ప్యానల్ వద్ద జనరల్ షిఫ్టులో విధులు నిర్వహిస్తున్నారు.
షిఫ్టులలో కార్మికులు తక్కువగా ఉన్నందున 35 మంది కార్మికులను జనరల్ షిఫ్ట్ నుంచి ఇటీవల షిఫ్టులకు మార్చింది. ఈ మార్పులో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు ఉన్నారు. అయితే గత సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో తాము ఎఐటీయూసీకి అనుకూలంగా పనిచేశామనే నెపంతో జనరల్ షిఫ్ట్(ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు )నుంచి షిఫ్ట్‌లోకి (ఒక వారం ఉదయం, ఒకవారం సాయంత్రం, ఒకవారం రాత్రి సమయాల్లో నిర్వహించే విధులు)వేశారని, వెంటనే తమను పాత జనరల్ షిఫ్ట్‌లో వేయాలని వారు డిమాండ్ చేశారు.
లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని గని ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలియగానే సింగరేణి ఇంటెలిజెన్స్, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని సెక్యూరిటీ కార్యాలయానికి తరలించారు. ఏరియా సెక్యూరిటీ అధికారి వి.శ్రీనివాసరావు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మేనేజ్‌మెంట్ పాలసీలలో భాగంగా అన్ని యూనియన్ల నుంచి కార్మికులకు జనరల్ షిఫ్ట్‌ల నుంచి షిఫ్ట్‌లలోకి మార్చామని, కార్మికులు అవగాహన లేకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సరైంది కాదని ఏరియా అధికారులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment