
సూర్యాపేట: ‘ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టే పాదయాత్ర చేస్తున్నా. కావాలంటే... కేసీఆర్, కేటీఆర్.. మీరు ఒక్కరోజు నాతో పాదయాత్రకు రండి. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతా. సమస్యలుంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయండి’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కేసీఆర్ మోసం చేయని వర్గం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ‘గాడిదకు రంగు పూసి ఆవు’ అని నమ్మించడమే కేసీఆర్ నైజమని విమర్శించారు. స్కూటర్ మీద తిరిగే స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.5వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రతిపక్షం ప్రశ్నించడం మరిచి కేసీఆర్ సంకన ఎక్కిందని, మతపిచ్చి బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిందని షర్మిల ఆరోపించారు. తన గుండెలో నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలని తపన ఉందని, ప్రజలంతా ఆశీర్వదిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు. సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పిట్టా రాంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment