
హనుమకొండలో జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న వైఎస్ షర్మిల
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు నష్టం కలిగిం చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ జుట్టు బీజేపీ చేతుల్లో ఉందని, అందుకే ఆ పార్టీతో అంటకాగుతున్న సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగ దీక్షలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల మంగళవారం వరంగల్ నగరానికి వచ్చారు. తొలుత హనుమకొండ కేయూ జంక్షన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ఈ సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. నిరుద్యోగుల కలల సాకారం కోసం ఎన్ని వారాలైనా దీక్షలు చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచేదాకా దీక్షలు కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలకు ఉద్యో గాలు ఇవ్వని కేసీఆర్, ఎంతమంది త్యాగం చేశారని ఆ కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నా రని షర్మిల నిలదీశారు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఏపూరి సోమన్న, ఎన్.భరత్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, కళ్యాణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment