సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన కోరిక అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. దీనికోసం ఏం చేయాలన్న దానిపై జిల్లాల వారీగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటానని ఆమె చెప్పారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసంలో ఆమె భేటీ అయ్యారు. అలాగే అదే జిల్లా నాయకులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం బాగా జరిగిందని, అందరూ ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ప్రతీ జిల్లాకు చెందిన నేతలను కలుస్తానని, హైదరాబాద్‌లోనా.. లేక జిల్లాలకు వెళ్లాలా.. అనేది త్వరలో నిర్ణయిస్తానన్నారు. వారానికి ఒకటి లేదా రెండు జిల్లాల వారిని కలుస్తానని పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడు పెడుతున్నారని ప్రశ్నించగా, పార్టీ పెడుతున్నానని మీరే నిర్ణయించుకున్నారా అని మీడియాను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా?.. విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? మీరే చెప్పాలని విలేకరులను అడిగారు. తాము సరైన దిశలో వెళుతున్నామని, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని షర్మిల వివరించారు. మీకు జగన్ మద్దతు ఉందా అని ప్రశ్నించగా, జగన్ మద్దతు లేదని మీకు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల
మనతోనే సాధ్యం...
ఆత్మీయ సమావేశంలో భాగంగా తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు తనతోనే సాధ్యమన్న నమ్మకం ఉందని షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి గుండెకు రాజన్న బిడ్డ నమస్కరిస్తోంది అంటూ ప్రసంగం ప్రారంభించిన షర్మిల ‘నాన్న మన నుంచి వెళ్లిపోయి ఎన్నేళ్లయినా అభిమానం చెక్కుచెదరలేదు. ప్రతి రైతు.. రాజు లాగా బతకాలి.. ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని ఆయన ఆశపడ్డారు. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలని, గొప్ప ఉద్యోగాలు చేయాలనుకున్నారు. పేదరికం ఒక శాపమని, వారికి అనారోగ్యం వస్తే అప్పుల పాలవుతారని ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అందుకే రాజన్న రాజ్యం మళ్లీ రావాలని నా కోరిక. నేను మాట్లాడటానికి రాలేదు.. మీరు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి వచ్చాను. వెల్‌కమ్’అని ముగించారు.
ఈ సమావేశంలో కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, నల్లగొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, గున్నం విజయభాస్కర్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, సిరాజ్ ఖాన్, మేకల ప్రదీప్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, పడాల శ్రీకాంత్, ఇంజం నర్సిరెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, పిడమర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ నేతలతో సమావేశంలో భాగంగా లోటస్‌పాండ్‌కు పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు తరలివచ్చారు. వారి కోలాహలంతో ఆ పరిసరాలు సందడిగా మారాయి.‘రావాలి షర్మిల.. కావాలి షర్మిల’ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.
Comments
Please login to add a commentAdd a comment