భక్తురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్న ఆలయ చైర్మన్
రేణిగుంట: శ్రీకాళహస్తి దేవస్థానం జలవినాయకుని సమీపంలో ఉన్న చంద్రపుష్కరణి వద్ద ఉన్న బావిలో ఆదివారం రాత్రి ఓ మహిళా భక్తురాలు ప్రమాదవశాత్తు జారిపడింది. వెంటనే అక్కడ ఉన్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బావిలో నుంచి బయటకు తీసి రక్షించారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రం, అదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ కుటుంబంలోని నలుగురు ఆదివారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారిలో సరస్వతి(38) అనే మహిళ ఆలయం బయటకు వచ్చి కార్ పార్కింగ్ చేసిన జలవినాయక ఆలయ సమీపంలో మూత్ర విసర్జన కోసం చంద్రపుష్కరణి వద్దకు వెళ్లింది. చీకట్లో ఆమెకు కనించకపోవడంతో పుష్కరిణి వద్దనున్న బావిలో జారిపడింది. బావిలో నీళ్లు ఉండడంతో శబ్దం వినిపించింది. వెంటనే అక్కడున్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను రక్షించారు. దేవస్థానం అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు కుడికాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వివరించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యఖర్చులు ఎంతైనా దేవస్థానమే భరిస్తుందన్నారు. అలాగే పుష్కరిణి వద్ద బావిపై భాగంలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment