వెంకటగిరిరూరల్: ‘హలో..ఏమండీ వంటగది డబ్బా కింద రూ.1,700 డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త.. నేను తెలుగుగంగ కాలువ దగ్గర ఉన్నా’ అంటూ ఓ మహిళ తన భర్తతో ఫోన్‌లో మాట్లాడి తెలుగుగంగ కాలువలో దిగి గల్లంతయింది. ఈ ఘటన వెంకటగిరి రూరల్ మండలం, కలపాడు గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఆమె భర్త కథనం.. డక్కిలి మండలం, ఎగువ లింగసముద్రం గ్రామానికి చెందిన వేముల మహేశ్వరి (38), ఆమె భర్త తిరుపాలయ్య, కుమారులు పవన్, కార్తీక్‌తో కలిసి వెంకటగిరి పట్టణంలోని రాణిపేటలో జీవనం సాగిస్తున్నారు.
మహేశ్వరి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కాళ్లకు ఉన్న పట్టీలు తీసి ఇంట్లోనే పెట్టి పర్సు తీసుకుని రాపూరుకు వెళ్లే బస్సు ఎక్కి డక్కిలి మండలం పలుగోడుకు టికెట్ తీసుకుంది. అయితే కలపాడు తెలుగుగంగ కాలువ వద్దకు వచ్చేసరికే మహేశ్వరి బస్సు దిగేసి కలపాడు గ్రామం వైపుగా కట్టమీద నడుచుకుంటూ వెళ్లింది. తన భార్య ఇంట్లో లేదని తెలుసుకున్న భర్త తిరుపాలయ్య మహేశ్వరికి పలుసార్లు ఫోన్ చేయగా మహేశ్వరి తిరిగి భర్తకు ఫోన్‌చేసి ‘‘ఏమండీ ఇంట్లో వంట గది డబ్బాల కింద రూ.1,700 నగదు ఉంది.
అవి తీసుకోండి.. పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఫోన్ మాట్లాడింది. కంగారు పడిన భర్త తిరుపాలయ్య మహేశ్వరిని గట్టిగా ప్రశ్నించగా కలపాడు వద్ద తెలుగుగంగ కాలువలో దూకి చనిపోతున్నట్లు తెలిపింది. దీంతో తిరుపాలయ్య కుటుంబ సభ్యులతో హూటాహుటిన ఘటన స్థలం వద్దకు చేరుకున్నాడు. తెలుగుగంగ కాలువ ఒడ్డుపై తన భార్య పర్సు, చెప్పులు వదిలేసి కాలువలోకి జారినట్లు ఆనవాళ్లు గుర్తించాడు. ఆమేరకు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. మహేశ్వరి కోసం తెలుగుగంగ కాలువలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహేశ్వరి కాలువలో గల్లంతవడానికి అప్పులు, ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment