గోవిందు హత్యకు భార్యే కారణం? | - | Sakshi
Sakshi News home page

గోవిందు హత్యకు భార్యే కారణం?

Published Mon, Dec 18 2023 12:36 AM | Last Updated on Mon, Dec 18 2023 8:31 AM

- - Sakshi

తిరుపతి రూరల్‌: వెదురుకుప్పం మండలం, తిప్పినాయుడపల్లికి చెందిన గోవిందు(30)ను కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి చంపినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. వివరాలు.. సదుం మండలం, కామ్నివారిపల్లికి చెందిన యువతి మదనపల్లిలోని బీటీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. అదే కళాశాలలో తనతో పాటు ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న అంగళ్లుకు చెందిన యువకుడితో ఆమె ప్రేమలో పడింది.

ఈప్రేమ వ్యవహారం తెలిసే యువతి తల్లిదండ్రులు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పూర్తికాకుండానే వెదురుకుప్పం మండలం, తిప్పినాయుడుపల్లికి చెందిన గోవిందుతో గత ఆగస్టులో కాణిపాకంలో వివాహం చేశారు. ఈ క్రమంలో తిరుపతి రూరల్‌ మండలం, చిగురువాడ పంచాయతీ, వైఎస్సార్‌ కాలనీలో దంపతులు కాపురం పెట్టారు. పెళ్లి అయ్యి మూడు నెలలు అవుతున్నా ప్రియుడిని మరవలేని ఆమె తన ప్రేమకు అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన ప్రియుడిని అంగళ్లు నుంచి తిరుపతికి పిలిపించినట్లు సమాచారం. ప్రియుడితో కలిసి అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గోవిందు గొంతు పిసికి చంపేశారు.

అనంతరం అకస్మత్తుగా చనిపోయినట్లు నాటకం ఆడింది. అంత్యక్రియల సమయంలో గోవిందు మృతదేహంపై గాయాలను గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం బయటపడింది. పోస్టుమార్టం రిపోర్టులోనూ ఇది హత్యగానే నిర్ధారణైంది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. తిరుపతి రూరల్‌ సీఐ సుబ్రమణ్యంరెడ్డి నిందితులను అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడితో కలిసి తన భర్తను తానే హత్య చేసినట్లు మృతుడి భార్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement