
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
తిరుపతి అర్బన్: జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగించినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి మే 31 వరకు గడువు పెంచినట్టు వెల్లడించారు. ఆయా మీడియా సంస్థల నుంచి యాజమాన్యం వారు తమ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి ఇవ్వాలని సూచించారు. వారు ఇచ్చే స్టిక్కర్లతో ఆర్టీసీలో బస్సు పాస్ పొందాలని తెలిపారు.
చెరువులో పడి వివాహిత మృతి
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం, వికృతమాల చెరువులో పడి వివాహిత మృతి చెందినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. వివరాలు.. మర్రిమంద బీసీ కాలనీలో కరివెళ్ల నవనీత (40), భర్త రామ్మూర్తి, కుమారుడు ధరణి(24) నివసిస్తున్నారు. రామ్మూర్తి నిత్యం తాగి, భార్యను హింసించేవాడు. కుమారుడు ధరణి స్థానికంగా ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ తండ్రి మార్గంలో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో శివరాత్రి రోజున కూడా రామ్మూర్తి మద్యం తాగి ఇంటికి రావడంతో అతని భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. జీవితం మీద విరక్తి చెందిన నవనీత అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి సమీపంలోని వికృతమాల చెరువులో దూకి మృతిచెందింది.
యూఏఎన్ కార్డుతోనే పథకాలు
తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు పొందడానికి యూఏఎన్ (యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) కార్డు తప్పనిసరి అని కార్మికశాఖ తిరుపతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చిన్నలాలెప్ప స్పష్టం చేశారు. గురువారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో ఆయన కార్మికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పేదోడు ఈ కార్డును చేయించుకోవాలని సూచించారు. ప్రధామంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదంతో మృతి చెందినా లేదా అంగవైకల్యం నెలకొన్నా రూ.2 లక్షల బీమా యోజన పొందవచ్చని చెప్పారు. ఈ కార్డును ఉచితంగానే అందజేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ తిరుపతి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు, ఆర్టీసీ సీనియర్ కంట్రోలర్ వీఆర్ కుమార్, కార్మికశాఖ సర్కిల్–1 అధికారి ప్రవీణ్‌కుమార్, సర్కిల్–2 ఆఫీసర్ శ్రీమన్నారాయణ, సర్కిల్–3 అధికారి రాజయ్య పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు
తిరుపతి క్రైం: నగరంలోని ఎయిర్‌బైపాస్ రోడ్డులోని ఓ సెలూన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. తిరుపతి అగ్నిమాపక అధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఎయిర్‌బైపాస్ రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఎదురుగా ఉన్న నేచురల్ సెలూన్ మొదటి అంతస్తులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.20 లక్షలకు పైగా ఆస్తినష్టం వచ్చినట్టు షాపు యజమాని గిరిధర్ తెలిపారని చెప్పారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment