జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం

Published Fri, Feb 28 2025 1:24 AM | Last Updated on Fri, Feb 28 2025 1:23 AM

జిల్ల

జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం

● సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధర తగ్గింపు ● తాము ఆడించే బియ్యానికి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు ● తూకాల్లోనూ మోసాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● కన్నెత్తి చూడని అధికారులు

సూళ్లూరుపేట: జిల్లాలో మిల్లర్ల మాయాజాలానికి రైతులు, వినియోగదారులు బలవుతున్నారు. మొదట సీజన్‌ ప్రారంభంలోనే మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. ఆపై బినామీలతో రేట్లు ఉండవని ఊదరగొట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. చివరగా కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతుల నుంచి ఒకటికి సగానికి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో ఆడించి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆపై ఆ బియ్యం రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల నుంచి అధికారుల వరకు సహకరిస్తుండడంతో వీరి అక్రమ వ్యాపారం మూడు బస్తాలు.. ఆరు లారీలుగా వర్థిల్లుతోంది.

సీజన్‌ ప్రారంభం కాగానే..

వరికోతల సీజన్‌ ప్రారంభం కాగానే మిల్లర్లు దళారులను రంగంలోకి దింపుతారు. బస్తా ధాన్యాన్ని రూ.1800 దాకా కొనుగోలు చేసి హైప్‌ చూపిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వీరు ఫాలో కానేకారు. ఆ తర్వాత మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి దళారుల చేతనే రేట్లు తగ్గిపోయాయని చెప్పిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంటలు బాగా పండడంతో అక్కడ రేట్లు లేవు.. తెలంగాణలోని కోదా డ, ఖమ్మం నుంచి భారీగా ధాన్యం వస్తోంది. పైపెచ్చు విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అందుకే రే ట్లు భారీగా తగ్గిపోయాయని రైతులను కలవర పెడు తుంటారు. ఆ తర్వాత మిల్లర్ల బినామీలు రంగప్రవే శం చేసి రూ.1,600, రూ.1,650 కొనుగోలు చేస్తారు. గత ఏడాది రూ.2,200 అమ్మిన బస్తా ధాన్యం ఈ యేడు ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాని పరిస్థితి.

మిల్లర్ల ముడుపులు

మిల్లర్లు సిండికేట్‌ ఏర్పడి అఽధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వారికి ముడుపులు చెల్లిస్తారు. ఆపై అధికారులను బుట్టలో వేసుకుని రైతుల కడుపుకొట్టడం ప్రారంభిస్తారు.

ధాన్యానికి– బియ్యానికి తేడా

75 కిలో బస్తా వరి ధాన్యాన్ని రైతుల వద్ద తరుగు కింద మరో ఐదు కిలోలకు కలిపి మొత్తం 80 కిలోలు తీసుకుంటారు. దీనికి బస్తాకు రూ.1,600 నుంచి రూ.1,700కు కొనుగోలు చేస్తారు. 75 కిలోల బస్తాను బియ్యంగా ఆడిఏ్త సుమారు 40 నుంచి 45 కిలోలు బియ్యం వస్తాయి. 6 కిలోలు నూకలు, 20 కేజీల తవుడు, 2 కిలోలు పొట్టు వస్తుంది.

అంటే

45 కిలోల బియ్యం రూ.2,700

6 కిలోలు నూకలు రూ.240

20 కేజీల తవుడు రూ.560

2 కిలోల పొట్టు రూ.80

రూ.3,600

ధాన్యం కొనుగోళ్లలో తేడాలు

వరి రకం సీజన్‌ ప్రారంభంలో ప్రస్తుతం

ధర రూ. రూ.

బీపీటీ జిలకర మసూరీ 1,600 1,550

కేఎన్‌ఎం 1,630 1,580

బియ్యం ధరలు ఎందుకు తగ్గించరు?

నేను గతంలో సుమారు ఐదు ఎకరాల దాకా వరి సాగుచేసేవాడ్ని. ప్రస్తుత పరిస్థితులు బాగోలేక వ్యవసాయం చేయడం మానేశా. కష్టపడి పండించిన పంటను ఎవరో మిల్లర్లు వచ్చి దోచుకెళుతున్నారు. అరు నెలలు పాటు పడిన కష్టాన్ని వ్యాపారం చేసుకునే వారు తక్కువ రేట్లతో దండుకుని వెళ్తున్నారు. ఇలా చేస్తే వ్యవసాయంలో అప్పులు తప్ప ఏమీ మిగలవు. ప్రస్తుతం ధాన్యానికి ధరలు లేవు కదా! మరి మార్కెట్లో బియ్యం రేట్లు ఎందుకు తగ్గట్లేదు..?.

– వంకా చంద్రశేఖర్‌, సూళ్లూరుపేట

ధాన్యానికి రేట్లు లేవు

రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లు సిండికేట్‌గా మారి మోసం చేస్తున్నారు. వారు తయారు చేసే బియ్యానికి మాత్రం రేట్లు తగ్గించకుండా విక్రయిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రైతు పండించిన ధాన్యానికి రేట్లు లేకుండా చేసి పబ్లిక్‌ మార్కెట్లోనేమో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు రేట్లు పెంచడమే కాకుండా తూకాల్లో కూడా ఒకటి రెండు కేజీలు తగ్గించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – గాలి మల్లికార్జున్‌రెడ్డి,

సుగ్గుపల్లి, సూళ్లూరుపేట మండలం

రేషన్‌ బియ్యాన్నీ వదలని మిల్లర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్‌ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని తాము ఆడించే బియ్యంలో పాలిష్‌ పట్టి బస్తాకు ఏడు నుంచి 9 కిలోల వరకు కలిపేస్తారు. ఇక్కడ మరొక ట్విస్టు ఏమిటంటే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు 75 కిలోల ధాన్యం బస్తాకి మరో ఐదు కిలోలు తరుగు కింద లాగేస్తారు. అదే బియ్యం ఽవద్దకొచ్చే సరికి గోతం మీద నెట్‌ వెయిట్‌ 25 కిలోలు అని ఉంటుంది. దాన్ని తూకం వేస్తే 23, 24 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తూనికలు కొలతలు శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడినా ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఆమ్యామ్యాలతో అంతా సర్దేసుకుంటారు మరి.

ఆ విషయం తెలియదు

మిల్లర్లు, దళారులు రాజ్యమేలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. ధాన్యం ధర లు తగ్గించేస్తున్నారన్న విషయం మాత్రం విన్నాను. – కేఎస్‌ఎన్‌.నరసింహారావు,

తహసీల్దార్‌, సూళ్లూరుపేట

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం 
1
1/2

జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం

జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం 
2
2/2

జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement