రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
● తిరుపతి జిల్లాలో 86 పరీక్ష కేంద్రాలు ● పరీక్షకు హాజరుకానున్న 63,197 మంది విద్యార్థులు ● వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ● ఆర్‌ఐఓ ప్రభాకర్‌రెడ్డి
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి జిల్లాలోని 86 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్‌ఐఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మార్చి 1న ఇంటర్ ప్రథమ సంవత్సరం, 3న ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టు పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. 63,197 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్‌లో 31,325 మంది, ఒకేషనల్‌లో 1,324 మంది మొత్తం 32,649 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 29,448 మంది, ఒకేషనల్‌లో 1,100 మంది, మొత్తం 30,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను కళాశాలతో నిమిత్తం లేకుండా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం అధికారులు 0877–2237200, 0877–2237332 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు.
సీసీ కెమెరా పర్యవేక్షణలో..
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ను పోలీస్ శాఖ అమలుచేయనుంది.
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులకు అనుగుణంగా బల్లలు, లైట్లు, ఫ్యాన్లు సిద్ధంచేశాం. తాగునీరు, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. డీఈసీ కమిటీ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాం.
– జీవీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి
రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment