తిరుమలలో అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు
తిరుమల: తిరుమలలో ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళంగా చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఉదయం అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి రూ.17 లక్షలు ఖర్చు చేస్తామని పేర్కొంది. దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని పేర్కొంది.
స్పోర్ట్స్ కోటా ద్వారాటీటీడీలో ఉద్యోగాల భర్తీ
తిరుపతి కల్చరల్: టీటీడీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆవరణలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులతో టీటీడీ ఈవో శ్యామలరావు క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. చైర్మన్, ఈవో, ఏఈవో, జేఈవో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి రూ.2,000, రూ.1,800, రూ.1,600 విలువైన బ్యాంకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో పురుషులు, మహిళలకు వేరు వేరుగా.. అలాగే, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ
తిరుపతి అర్బన్: తిరుమలలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న పద్మావతి పార్క్‌లో ఈ ఏడాది జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, మరో 44 మంది గాయపడిన విషయం విధితమే. శుక్రవారం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు భక్తులను విచారణ చేశారు. తిరుపతి నెహ్రూవీధికి చెందిన ఓ భక్తుడు ఇంటి నుంచే తన మొబైల్ ద్వారా వర్చువల్ విధానంలో హాజరయ్యారు. అలాగే విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన మరో మహిళా భక్తురాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన మరో భక్తుడు మొబైల్ ద్వారా వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 35 మందిని విచారణ చేశారు.
రైల్వే స్టేషన్‌లో తాగునీటి ఇక్కట్లు
తిరుపతి మంగళం: నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో తాగునీటి సమ స్య తాండవిస్తోందని, వెంటనే పరిష్కారం చూపాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఉన్న తాగునీటి కొళాయిలను మరమ్మతులు చేయించడంతోపాటు వేసవి నేపథ్యంలో అదనపు కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తిరుపతి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి తదితర రైల్వే స్టేషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. చోరీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని వివరించారు.
తిరుమలలో అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment