
బడ్జెట్‌పై అవగాహన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి, భారత పరిశ్రమల సమాఖ్య, శ్రీసిటీ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర వార్షిక బడ్జెట్, పన్నులు, ఆడిటింగ్ పై శ్రీసిటీలో అవగాహన సమావేశం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆడిట్ కమిషనర్ పీ. ఆనంద్‌కుమార్, ఐఆర్‌ఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలకు తాజా పన్నుల విధానం, అనుగుణ్యత మార్గదర్శకాలు, కేంద్ర బడ్జెట్ ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఆనంద్ కుమార్‌కు శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆనంద్ కుమార్ తయారీ పరిశ్రమలు, సేవలందించే సంస్థల ఆడిటింగ్ విధానాలు, అలాగే ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా సమర్థత పెంపు వంటి పలు అంశాలపై ప్రసంగించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌ఏ.మాలతి మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్‌లో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అంతర్గత జలమార్గాలు తదితరాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను వివరించారు.