
తవ్వుకో.. తరలించుకో!
● గూడూరు నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● ప్రజాప్రతినిధి అండతో చెలరేగిపోతున్న కూటమి నేతలు ● ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ ● భయాందోళనలో తుంగపాళెం వాసులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు రూరల్ పరిధి, చెన్నూరు రెవెన్యూలో అనుమతులు లేని ఓ మైనింగ్ కంపెనీని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తుంగపాళెం ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి సదరు మైనింగ్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఆరు నుంచి ఎనిమిది టిప్పర్ల క్వార్జ్ట్ ఖనిజాన్ని చైన్నె ప్రాంతానికి తరలిస్తున్నారు.
మైన్‌లోకి బయట నుంచి ఖనిజం
అనుమతులు లేని మైన్‌లోకి ప్రభుత్వ భూముల్లో తవ్విన క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి అక్కడ వాటిని గ్రేడింగ్ చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ అక్రమంగా మైనింగ్ జరగడానికి స్థానిక ప్రజాప్రతినిధి అండగా ఉండగా చెన్నూరు ప్రాంతానికి చెందిన ఓ కూటమి నాయకుడు కనుసన్నల్లోనే ఈ తతంగం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
తుంగపాళెం సమీపంలోని మైనింగ్ కంపెనీలో అక్రమంగా తవ్వకాలు చేసి క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మైనింగ్ కంపెనీలో భాగస్వామి ఒకరు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనకు ఫిర్యాదు చేశారు. తనకు మైనింగ్ విషయం తెలియకుండానే అక్రమంగా తవ్వకాలు, తరలింపు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
మెటీరియల్‌కు అనుమతులు ఉన్నాయి
తుంగపాళెం సమీపంలో ఉన్న మైన్‌కు అనుమతులు అయితే లేవు గానీ, అందులో మూత వేసే సమయంలో ఉన్న ఖనిజాన్ని బయటకు తరలించుకునేందుకు అనుమతులు కావాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు వాటిని పరిశీలించి ఉన్న ఖనిజాన్ని తరలించే వరకు అనుమతులు మంజూరు చేసి ఉన్నారు. బయట నుంచి ఖనిజాన్ని తరలించే విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, గనులశాఖాధికారి, గూడూరు
రాత్రి బ్లాసింగ్.. పగలు రైట్‌రైట్
చెన్నూరు బిట్–2లోని తుంగపాళెం సమీపంలో ప్రభుత్వ, మేత పోరంబోకు భూములున్నాయి. వీటిలో విలువైన క్వార్ట్జ్ ఖనిజం ఉంది. దీనిపై కూటమి నేతలు దృష్టి పెట్టారు. అనుమతులు లేని మైనింగ్ నిర్వాహకులతో కుమ్మకై ్క రాత్రిపూట బ్లాస్టింగ్ చేసి.. పగటి పూట మెటీరియల్‌ను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ముడిసరుకును నేరుగా టిప్పర్లలో చైన్నెకి చేరవేస్తున్నారు.
క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలిస్తున్న టిప్పర్లు
బ్లాస్టింగ్‌కు అనుమతులు ఎక్కడవి?.
గనుల శాఖలో బ్లాస్టింగ్ చేయాలంటే పలు రకాల అనుమతులు అవసరం. అయితే తుంగపాళెం వద్ద అసలు ఎలాంటి అనుమతులు లేని మైనింగ్‌లో రాత్రి పూట బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీనిద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రిపూట నిద్రలేక అగచాట్లు పడుతున్నారు.

తవ్వుకో.. తరలించుకో!