
గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం కృషి
● కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరం హామీ ఇచ్చారు. గురువారం ఆయన జాతీయ సంస్కృత వర్సిటీలో పర్యటించి అధికారులు, గిరిజన విద్యార్థులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంస్కృత భాషా వ్యాప్తికి వర్సిటీ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వర్సిటీ పరిశోధనలు, విద్యాభివృద్ధిలోనూ అగ్రస్థానంలో కొనసాగుతుండటం ప్రశంసనీయమన్నారు. భారతీ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. అనంతరం ఆయన వర్సిటీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒడిశా చైర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పాండా, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.