
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక వ సంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు ఉభయనాంచారులతో కలసి హంస వాహనంపై విహరించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను కొలువు దీర్చి, కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శ్రీవారి కల్యాణ మండపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించి, మెరుగైన సరఫరాకు కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి ఎస్‌ఈ సురేంద్రనాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతి సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సురేంద్ర నాయుడు శుక్రవారం శ్రీసిటీలో నిర్వహించిన పరిశ్రమల విద్యుత్ వినియోగదారుల సదస్సులో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగం, సరఫరా, ఇతర విద్యుత్ సమస్యలపై పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. పరిశ్రమ వర్గాలకు పలు సందేహాలను నివృత్తి చేశారు.
తుంబురు తీర్థానికి భారీగా భక్తులు
తిరుమల: తుంబురు తీర్థ ముక్కోటికి భారీగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శుక్రవారం, శనివారం పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు శేషాచల అడవుల్లోని తుంబూరు తీర్థ ముక్కోటికి వస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు భక్తులను అనుమతించారు. తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి శ్రీ తుంబురుడిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, నీళ్ళు, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు భద్రత, వైద్యసేవలను తితిదే విజిలెన్స్ ఆటవీశాఖ, వైద్యవిభాగం ఏర్పాటు చేశారు. భక్తులను శనివారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మాత్రమే తుంబురు తీర్ధంకు అనుమతిస్తారు తితిదే ఏర్పాట్లను వీజీఓ సురేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదర్రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి జీఎల్‌ఎన్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు.

హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు